దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ కేసులో బాధితులుకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు, మహిళా, దళిత, పౌరహక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆందోళనలు నిర్వహించాయి కూడా. ఈ క్రమంలో హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే హత్రాస్‌లో ప్రత్యక్షమవడంతో ఆయనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

కరోనా సోకిన ఐదు రోజులకే ఆయన బహిరంగంగా తిరగటంతో అంటువ్యాధుల నివారణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దిల్లీలోని కోండ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కుల్దీప్‌ కుమార్‌ తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని సెప్టెంబర్‌ 29న ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  

అక్టోబర్‌ 2న పలుమార్లు ట్వీట్లు చేస్తూ ప్రస్తుతం తాను హత్రాస్‌లో ఉన్నానని, బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినట్లు వీడియోలు పోస్ట్ చేశాడు. బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న వీడియో కూడా అందులో ఉంది. ఈ విషయం యూపీ పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేశారు.   

కాగా ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో సెప్టెంబర్‌ 14న ఉన్నత వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు ఓ దళిత యువతిపై సామూహక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 29న మృతిచెందింది. తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.