Asianet News TeluguAsianet News Telugu

హత్రాస్ బాధితురాలి ఐడెంటిటీ: దిగ్విజయ్, స్వర భాస్కర్‌పై మహిళా కమీషన్ ఫైర్

నిబంధనలకు విరుద్ధంగా హత్రాస్ బాధితురాలి గుర్తింపును సోషల్ మీడియాలో షేర్ చేసినవారందరిపైనా జాతీయ మహిళా కమిషన్ తీవ్ర చర్య తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Case against Swara Bhaskar, Digvijaya Singh, Amit Malviya for disclosing Hathras victim's identity
Author
New Delhi, First Published Oct 4, 2020, 9:01 PM IST

నిబంధనలకు విరుద్ధంగా హత్రాస్ బాధితురాలి గుర్తింపును సోషల్ మీడియాలో షేర్ చేసినవారందరిపైనా జాతీయ మహిళా కమిషన్ తీవ్ర చర్య తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో నటి స్వర భాస్కర్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ కూడా ఉన్నారు.

ఐపీసీ (భారత శిక్షాస్మృతి) ప్రకారం, రేప్ కు గురైన బాధితురాలి పేరును గానీ, ఆమె వివరాలను గానీ వెల్లడించడం నిషేధం. కానీ స్వర భాస్కర్, దిగ్విజయ్ సింగ్, మాలవీయ తదితరులు సోషల్ మీడియాలో హత్రాస్ బాధితురాలి ఐడెంటిటీని పేర్కొన్నారని, మరికొంతమంది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రస్తావించారని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ తెలిపారు.

అసలు ఇప్పటి వరకు బాధితురాలిపై అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయంపై రిపోర్టులో స్పష్టత లేదన్నారు. మరోవైపు కోర్టు స్వీయ విచారణ జరుపుతోందన్నారు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ఆమె ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో, పోస్టర్లలో వెల్లడించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

అలీగఢ్‌ మెడికల్ యూనివర్శిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దళిత బాలిక చెబుతున్న వీడియోను బీజీపీ ఐటీ సెల్‌ విభాగం అధిపతి అమిత్‌ మాల్వియా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 

అత్యాచారం, హత్యాయత్నం కేసులో తీవ్రంగా గాయపడిన దళిత యువతి సెప్టెంబర్‌ 29న ఢిల్లీ ఆస్పత్రిలో మరణించగా, అంతకుముందు ఆమె మీడియా ప్రతినిథికి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో క్లిప్పింగ్‌ను అమిత్‌ మాల్వియా అక్టోబర్‌ రెండవ తేదీన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

మరోవైపు అత్యాచారం కేసులో బాధితురాలి పేరును బహిర్గతం చేయడం నేరం. ఆ దళిత యువతిపై నిజంగా అత్యాచారం జరిగిన పక్షంలో అమిత్‌ మాల్వియాపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ హెచ్చరించారు.

ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు మాల్వియాతో తాను స్వయంగా మాట్లాడుతానని కమీషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ వెల్లడించారు. ఈమె వ్యాఖ్యలకు మద్ధతు తెలుపుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమీషన్ చీఫ్ విమ్లా బాతమ్ కూడా మాల్వియాను హెచ్చరించారు.

అయితే బీజేపీ మహిళా మోర్చా, సోషల్ మీడియా చీఫ్ ప్రీతి గాంధీ మాత్రం మాల్వియాను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.  మాల్వియా విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్‌లో దళిత యువతి తనపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపించారు తప్పా, అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు చేయలేదని ఆమె పేర్కొన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలోని ఓ గ్రామంలో సెప్టెంబరు 14న పందొమ్మిదేళ్ళ దళిత యువతిపై అగ్ర వర్ణానికి చెందిన నలుగురు అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరచినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధితురాలు సెప్టెంబరు 29న ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిఫారసు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios