ఇంట్లో ఒక లైటు, ఒక ఫ్యాన్ ఉండి బతుకు బండి ఈడుస్తున్న పేదలకు లక్షల్లో కరెంట్ బిల్లులు వేసి విద్యుత్ శాఖ అధికారులు వార్తల్లో నిలిచేవారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి జీఎస్టీ అధికారులు కూడా చేరారు.

పూట గడవటం కోసం డ్రైవర్‌గా‌ పని చేసుకునే ఓ వ్యక్తికి జీఎస్టీ దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల మేర పన్ను ఎగవేశావంటూ నోటీసులు పంపించారు.

వివరాల్లోకి వెళితే.. ఒడిస్సాలోని రూర్కేలాకు చెందిన రాజేంద్ర పల్లై డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం కటక్‌, జీఎస్టీ ఆఫీసు నుంచి అతడికి ఏవో నోటీసులు వచ్చాయి. ‘‘ రాజేంద్ర.. ఆర్పీ ఎంటర్ ‌ప్రైజెస్‌ అనే కంపెనీకి యజమాని. ఆ కంపెనీ పేరిట 4.31 కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉన్నాయి

అది కూడా నకిలీ కంపెనీ పేరిట, నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి పన్ను ఎగవేశావు’’ అని నోటీసులో ఉంది.  దీంతో రాజేంద్రకు ఏం అర్ధం కాలేదు. కాసేపటి తర్వాత తేరుకున్న అతనికి విషయం అర్ధమైంది. ఎవరో తన ఐడెంటిటీని దొంగిలించారని గుర్తించాడు.

దీనిపై రాజేంద్ర  మాట్లాడుతూ.. ‘‘ కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి నాకు 10 వేల రూపాయలు వచ్చే జీతం ఇప్పిస్తానని చెప్పి, నా వద్ద నుంచి ఆధార్‌ కార్డు ఇతర పత్రాలు తీసుకున్నాడు. సదరు ధ్రువ పత్రాల ఆధారంగా నా పేరిట నకిలీ కంపెనీ సృష్టించారని తెలిసింది. అధికారులు దీనిపై విచారణ జరపాలని కోరుకుంటున్నానని చెప్పాడు.