బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. బస్సు కాలువలోకి బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది.

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా కనగమారడిలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను ఎంఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. 

బస్సు కాలువలో పడడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు.  బస్సు అడ్డంగా పడిపోవడంతో డోర్స్ తెరవడానికి వీలు కాలేదని, దాంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారని పోలీసులు అంటున్నారు. కాలువలోకి దూసుకెళ్లిన మరుక్షమే బస్సు మునిగిపోయింది. 

ఆ పరిసరాల్లో పనులు చేసుకుంటున్న రైతులు వెంటనే వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. దాంతో కొంత మంది బతికి బయటపడ్డారు. తాళ్లు కట్టి బస్సును స్థానికులు బయటకు లాగడానికి ప్రయత్నించారు. శవాలను వెలికి తీశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కుమార స్వామి మాండ్ాయ జిల్లా ఇంచార్జీ మంత్రి, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.