కేంద్రం మరో ‘సెస్’ ను ముందుకు తెచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ రాబడి అంతంతే కావడం, కరోనా వ్యాక్సిన్‌ను దేశమంతా పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వాటికి అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ‘కరోనా సెస్’ను విధించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 

ఈ విషయంతో పాటు ఆదాయాన్ని పెంచే చర్యలపై కేంద్రం ఇప్పటికే నిపుణులతో ఓ ప్రాథమిక భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. సెస్ లేదా సర్‌చార్జీ రూపంలో కొత్త లేవీని విధించే విషయంలో మాత్రం కేంద్రం ఇంకా ఓ తుది నిర్ణయానికి రాలేదు. అయితే ఈ నిర్ణయాన్ని పరిశ్రమలు, ఆర్థిక నిపుణులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. 

నూతన బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్రం వివిధ పారిశ్రామిక వేత్తల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో ఓ భేటీ నిర్వహించింది. ప్రస్తుత సమయంలో కొత్త కొత్త పన్నులను విధించరాదని, ఇది ఎంత మాత్రం సరైన నిర్ణయం కాదని కేంద్రానికి తెగేసి చెప్పారు. 

నూతన సెస్‌ను విధించే విషయంలో అధికారుల మధ్య చర్చలు జరిగినట్లు కొందరు స్పష్టం చేస్తున్నారు. అధిక ఆదాయం కలిగి ఉన్నవారికి పరోక్షంగా పన్నులు వేయాలన్న ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

దీంతో పాటు మరో ప్రతిపాదననూ కేంద్రం సిద్ధం చేసింది. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు విధించాలని ప్రతిపాదనలను కూడా సిద్ధం చేశారు.