కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే ఒకరు అసెంబ్లీలో పాడుపని చేశారు. సభ జరుగుతుండగానే తన మొబైల్‌లో అమ్మాయిల ఫోటోలను వీక్షిస్తూ కెమెరాలకు చిక్కారు. వివరాల్లోకి వెళితే శాసనసభ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం బీఎస్పీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్.మహేశ్ సభకు హాజరయ్యారు.

సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో మహేశ్ తన స్మార్ట్‌ఫోన్‌ను అందుకున్నారు. వాట్సాప్ ఆన్‌చేసి దానిలో అమ్మాయిల ఫోటోలను చూడసాగారు. సభలో సభ్యులు మాట్లాడుతుంటే ఆయన మాత్రం ఫోన్‌లోనే నిమగ్నమయ్యారు.

ఇది సీసీ కెమెరాలకు చిక్కడంతో మీడియా ఆయనను ప్రశ్నించింది. తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నానని, అమ్మాయిని వెతికే ప్రయత్నాల్లో భాగంగా ఓ మిత్రుడు పంపిన అమ్మాయిల ఫోటోలను తాను అసెంబ్లీలో చూశానని, ఈ విషయంలో ఎటువంటి దురుద్దేశాలు లేవని అన్నారు.

సదరు అమ్మాయిల ఫోటోలను టీవీలో చూపించి.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని మహేశ్ మీడియాను కోరాడు. కాగా, యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్లో నీలిచిత్రాలు చూస్తూ కెమెరాలకు చిక్కారు.

ఈ సంఘటన జరిగిన నాటి నుంచి సభలోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించారు. సభ్యుల ఫోన్ల వినియోగానికి ప్రత్యేక గదిని కేటాయించారు. నిషేధం ఉన్నప్పటికీ ఎమ్మెల్యే మహేశ్ సభలోకి ఫోన్ తీసుకురావడం తాజాగా వివాదాస్పదమైంది.