లక్నో: వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని దూరంగా పెట్టాలని బిఎస్పీ అధినేత మాయావతి, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే లోకసభ సీట్ల పంపకం కూడా జరిగినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

రాష్ట్రీయ లోకదళ్ కూడా వారితో జత కట్టినట్లు తెలుస్తోంది. ఎస్పీ, బిఎస్పీ సమానంగా సీట్లను పంచుకుని రాష్ట్రీయ లోకదళ్ కు మూడు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. తమ మధ్య జరిగిన సీట్ల పంపకంపై ఇరు పార్టీలు వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి. జనవరి 15వ తేదీ మాయావతి పుట్టిన రోజు.

ఈ రెండు పార్టీలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి గట్టి పోటీ ఇస్తాయని భావిస్తున్నారు. గోరక్ పూర్, ఫుల్పూర్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ, బిఎస్పీ బిజెపిని ఓడించాయి. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మాయావతి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోలేదు. 

ఎన్నికలకు ముందు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని మాయావతి ప్రకటించారు కూడా.  మాయావతి తమతో పొత్తుకు ఇష్టపడకపోవడంతో కాంగ్రెసు ఎస్పీతో పొత్తుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఎస్పీ కూడా అందుకు ఇష్టపడలేదని సమాచారం. 

అయినా కూడా కాంగ్రెసు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 114 సీట్లను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీకి రెండు సీట్లు అవసరం కావడంతో బిఎస్పీ కాంగ్రెసుకు మద్దతు ప్రకటించింది. 

ఉత్తరప్రదేశ్ లో 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నారు. అయితే, బిజెపి రాష్ట్రంలో ఘన విజయం సాధించింది. ఈ స్థితిలో వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెసుతో కలిసి నడవకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 80 లోకసభ స్థానాలున్నాయి. దాంతో కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశ్ కీలకమవుతుంది.