Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం కీలక సమావేశం కానున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, శేషాద్రి చారి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 

Vice President Election: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ రాజీనామా చేయడంతో ఈ పదవిని ఎవరు చేపడతారనే చర్చ మొదలయ్యింది. అనారోగ్య కారణాలతో జగదీప్ ధన్‌ఖడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈయన ఆకస్మిక రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ (NDA) తమ అభ్యర్థిని ఖరారు చేయడానికి సిద్దమవుతుంది. ఈ ఇంతకీ రేసులో ఎవరెవరు ఉన్నారు? అనే ఆసక్తికరంగా మారింది.

సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ (NDA) తరఫున అభ్యర్థిని ఖరారు చేయడానికి రంగం సిద్దమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఆగస్టు 17 (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు కీలక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జగత్ ప్రకాశ్ నడ్డా పాల్గొని అభ్యర్థిని నిర్ణయించనున్నారు. ఈ సమావేశం కూటమి భాగస్వాముల నుండి ఏకాభిప్రాయంతో ఓ అభ్యర్థి ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు అంచనా వ్యక్తమవుతోంది.

ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో కేంద్ర హోం, రక్షణ శాఖ మంత్రులు, సీనియర్ బిజెపి నేతలతో కలసి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, BJP చీఫ్ జెపీ నడ్డాలకు అత్యున్నత రాజ్యాంగ పదవికి అభ్యర్థిని నిర్ణయించే బాధ్యత అప్పగించబడినట్లు వర్గాలు వెల్లడించాయి.

సీనియర్ బిజెపి వర్గాల ప్రకారం.. ప్రధాన నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు జెపీ నడ్డాతో కలిసి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విస్తృత చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి, వాటిలో ఒకరిని ఫైనల్ చేయడానికి ఆదివారం NDA కీలక సమావేశం కానున్నది. ఈ అభ్యర్థుల రేసులో ముఖ్యంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త, బిజెపి సీనియర్ సభ్యుడు శేషాద్రి చారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే.. ప్రస్తుత, మాజీ గవర్నర్లు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక NDA పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఆగస్టు 21న కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ పత్రాల దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా, ఆగస్టు 20న NDA విందు జరిగే అవకాశం ఉందని, ఆ సమయంలో అభ్యర్థి పేరుపై ఏకాభిప్రాయంతో అధికారికంగా ప్రకటిస్తారని వర్గాలు తెలిపాయి. 

అలాగే, ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ విధానాలపై బిజెపి ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి సెప్టెంబర్ 6 నుంచి 9 మధ్య రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలను ఢిల్లీలో ఉండమని పార్టీ కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. రేపటి సమావేశం తర్వాతే NDA అభ్యర్థి తుది రూపం పొందనుంది.