అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు రోజుకో రూపు మారుతున్నాయి. ఇప్పటికే పార్టీ పెట్టబోవడంలేదంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించి తన అభిమానుల్ని నిరాశలో పడేశారు. 

ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు తాము కోరుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ప్రకటించారు. దీంతో ఇక రాజకీయ పార్టీ స్థాపించనని సూపర్ స్టార్ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ చేసిన ప్రకటన అత్యంత ప్రాధాన్యం సంతరిచుకుంది. 

మోదీ, రజనీకాంత్ మధ్య ఎంతటి ఆత్మీయత ఉందో అందరికీ తెలుసని సీటీ రవి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని తాము అడుగుతామని ఆయన స్పష్టం చేశారు. 

సంకీర్ణ భాగస్వామి అయిన అన్నాడీఎంకే కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. తమిళనాడు సంకీర్ణంలో అన్నాడీఎంకేయే అతి పెద్ద పార్టీ అని, ఆ పార్టీ అభ్యర్థే సీఎం అవుతారని సీటీ రవి స్పష్టం చేశారు. 

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తన రాజకీయ ప్రవేశంపై వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాల్లోకి రావడం లేదంటూ మూడు పేజీల స్టేమెంట్ విడుదల చేశారు. ప్రస్తుతం పార్టీని ఏర్పాటు చేయలేనని ప్రకటించారు. రజనీ రాజకీయాల్లోకి వద్దంటూ కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

రజనీ రాజకీయ ప్రవేశంపై చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఆయన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ప్రకటన చేయాల్సి ఉంది. అభిమాన సంఘాలు కూడా పార్టీ గుర్తుగా ఆటో కూడా ఖరారైనట్లు ప్రచారం జరిగింది. 

ఈ సమయంలో హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో రజనీ హైదరాబాద్‌ అపోలోలో చికిత్స పొందారు. డిశ్చార్జ్‌ తర్వాత ఆయన చెన్నై వెళ్లిపోయారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లోకి వద్దంటూ ఆయనపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. కూతుళ్లు ఇద్దరూ ఆయనపై తీవ్ర వత్తిడి తెచ్చారు. దీంతో రజనీ వెనకడుగు వేశారు.