తమిళనాడు పట్టణ పురపాలక సంస్థల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతున్నది. ఈ కౌంటింగ్‌ సరళిలో బీజేపీ అనూహ్య ఆధిక్యతను కనబరుస్తున్నది. చెన్నైలో డీఎంకే అఖండ విజయం వైపు దూసుకుపోతుండగా, రెండో స్థానంలో ఏఐఏడీఎంకేను తలదన్ని బీజేపీ నిలవడం గమనార్హం.  

చెన్నై: ద్రవిడ(Dravidian) నేలపై కాషాయ జెండా(Saffron) రెపరెపలాడుతున్నది. పట్టణ పురపాలక సంస్థల ఎన్నికల్లో కమలం విరిసింది. ఏఐఏడీఎంకే(AIADMK)ను వెనక్కి నెట్టి మరీ రెండో స్థానాన్ని బీజేపీ(BJP) ఆక్రమించుకుంది. పట్టణ స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ డీఎంకే(DMK) అఖండ విజయం వైపుగా దూసుకెళ్లుతున్నది. కాగా, దాని తర్వాత రెండో స్థానంలో బీజేపీ ఆధిక్యతను కొనసాగించడం మరో ఆశ్చర్యకర విషయంగా మారింది.

తమిళనాడులో ద్రవిడ సెంటిమెంట్ ఎక్కువ. ఆ రాష్ట్రంలో అయితే డీఎంకే, లేదంటే అన్నా డీఎంకే.. ఈ రెండు పార్టీలు మాత్రమే అధికారాన్ని అధిరోహించాలి. పాలనను వంతులు వేసుకున్నట్టుగానే ఈ రెండు పార్టీల మధ్య అధికారం మారుతుండేది. ఇప్పటికీ అదే జరుగుతున్నది. మరే ఇతర పార్టీలు అక్కడ బలమైన ఉనికిని చాటింది లేదు. తమిళనాడులో ఉనికి కోసం బీజేపీ కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. పళనిస్వామి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి. ఈ స్థానిక ఎన్నికల ఫలితాలు ఆ ప్రయత్నాలు వృథాగా పోలేవని వెల్లడించాయి. ఇక్కడ బీజేపీ రికార్డులు చెరిపేస్తున్నది.

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కే అన్నమలై ఈ ఫలితాల ట్రెండ్స్‌పై స్పందిస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. అసెంబ్లీలోనూ ప్రతిపక్ష మోదాలో ఏఐఏడీఎంకే ఉన్నప్పటికీ.. ఆ పార్టీ నేతల కంటే కూడా బీజేపీ నేతలే స్టాలిన్ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. ప్రతి అంశంపైనా ప్రభుత్వంపై పటిష్ట వాదనలు చేస్తున్నారు. ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ ఆ పార్టీ దానికి స్వయంగా పునాదులు వేసుకుంటున్నది. ఈ స్థానిక ఎన్నికల్లో బీజేపీ, ఏఐఏడీఎంకేలు వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే, 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కలిసే పోటీ చేస్తామని ప్రకటించుకున్నాయి.

పట్టణ పురపాలక సంస్థల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ఇంకా జరుగుతూ ఉన్నది. ట్రెండ్స్ ప్రకారం, చాలా చోట్ల అధికార పార్టీ డీఎంకే ముందంజలో ఉన్నది. ఆ పార్టీ అపూర్వ విజయాన్ని నమోదు చేసే దిశగా వెళ్తున్నది. ఏఐఏడీఎంకేకు కంచుకోట వంటి కోయంబత్తూర్ సహా చెన్నై, మదురై, సేలం సహా 21 కార్పొరేషన్‌లలో డీఎంకే ఆధిక్యతను ప్రదర్శిస్తున్నది. చెన్నైలోని 200 వార్డులకు గాను 150 వార్డులను గెలుచుకుని పట్టణ మేయర్ పదవిని డీఎంకేను సులువుగా కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చెన్నైలో డీఎంకే ఘన విజయం నమోదు చేయనుంది. ఇప్పటి వరకు డీఎంకే 15 వార్డులు గెలుచుకుంది. ఏఐఏడీఎంకే కేవలం ఒక్క వార్డు మాత్రమే గెలుచుకుంది. కాగా, బీజేపీ ఏఐఏడీఎంకే ఢీకొట్టి ఐదు వార్డుల్లో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైలో ఇప్పుడు బీజేపీ సెకండ్ పొజిషన్‌లో ఉన్నది. చెన్నైలోని 174వ వార్డును డీఎంకే గెలుచుకోగా, బీజేపీ రెండో స్థానంలో, డీఎంకే మూడో స్థానంలో నిలిచింది. ఈ వార్డులో డీఎంకే 6343 ఓట్ల గెలుచుకోగా, బీజేపీ 1847 ఓట్లు, ఏఐఏడీఎంకే 1403 ఓట్లు గెలుచుకుంది. డీఎంకే అభ్యర్థి రాధిక సుమారు 4960 ఓట్ల మార్జిన్‌తో గెలిచారు.

అదే విధంగా 54వ వార్డులోనూ ఏఐఏడీఎంకేను బీజేపీ ఓవర్‌టేక్ చేసింది. బీజేపీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నది. డీఎంకే క్యాండిడేట్ 3570 ఓట్లతో లీడ్‌లో ఉండగా, 1142 ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో, 818 ఓట్లతో ఏఐఏడీఎంకే మూడో స్థానంలో ఉన్నది. ఏఐఏడీఎంకే కంటే బీజేపీకి 300 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.