బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కి చేదు అనుభవం  ఎదురైంది. ప్రమాదవశాత్తు.. ఆయన హెలికాప్టర్ నుంచి కిందకు పడిపోయారు.  మిజోరాం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లగా.. అక్కడ ఈ సంఘటన చోటుచేసుకుంది. గురువారం ఈ ఘటన జరగగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...త్వరలో మిజోరాంలో జరగనున్న ఎన్నికల కోసం పార్టీ తరపున ప్రచారం చేసేందుకు అమిత్ షా గురువారం వెస్ట్ తుయ్ పూయ్ నియోజకవర్గంలోని త్లబంగ్ అనే గ్రామానికి వెళ్లారు. కాగా.. ఆ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గ్రామంలో ల్యాండ్ అయిన అనంతరం.. కిందకు దిగుతున్న క్రమంలో పొరపాటున ఆయన జారి కిందపడ్డారు. దీంతో అమాంతం నేలపై బోర్లా పడిపోయారు.
 
అమిత్‌షాతో పాటు హెలికాప్టర్‌లో వెళ్లిన మరో వ్యక్తి ఆయనను పైకి లేపి, దుస్తులకు అంటిన దుమ్మును తుడిచారు. అనంతరం కొద్ది క్షణాల్లోనే తేరుకున్న అమిత్ షా.. అక్కడి నుంచి మళ్లీ ప్రయాణం కొనసాగించారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.