కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్భూ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాను రెండు పదబంధాలను తప్పుగా వాడానని, ఇందుకు తనను క్షమించాలని.. మరోసారి జరగకుండా చూస్తానని ఖుష్బూ స్పష్టం చేశారు.

జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన నటి కుష్బుకు చెన్నై విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌తో పాటు పలువురు నేతలు ఆమెను పూలమాలతో ముంచెత్తారు.

అక్కడి నుంచి నేరుగా కమలాలయం చేరుకున్న కుష్బు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో తనను అణగదొక్కారని, అక్కడ బుర్ర తక్కువ నాయకులే ఎక్కువని, తనకు తెలివి ఉండబట్టే మేల్కొని బయటకు వచ్చేశానని వ్యాఖ్యానించారు.

ఇది వరకు ప్రతి పక్షంలో ఉండబట్టే, అధికార పక్షాన్ని వ్యతిరేకించినట్టు తెలిపారు. ఇప్పుడు తానో నటి అన్న విషయం కాంగ్రెస్‌ వాళ్లకు గుర్తొచ్చినట్టుందని ఖుష్బూ మండిపడ్డారు.

ఆమె వ్యాఖ్యలు తమిళనాట పెను దుమారం రేపాయి. ఖుష్భూ మీద ఓ హక్కుల సంస్థ 30 పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసింది. వెంటనే స్పందించిన ఆమె దిద్దుబాటు చర్యల్లో భాగంగానే బహిరంగ లేఖ విడుదల చేశారు.

‘ఆ సమయంలో నేను తీవ్ర దుఖం, వేదనలో ఉన్నాను. ఆ తొందరపాటులో రెండు పదబంధాలను తప్పుగా ఉపయోగించినందుకు నేను బాధపడుతున్నారు. నాకు నేనుగా ఎదిగిన వ్యక్తిని. అలాంటిది నేను వేరే వాళ్ల డైరెక్షన్‌లో.. వారి ఆలోచనల మేరకు మాట్లాడుతున్నాను అనడం అభ్యంతరకరమైనది’ అన్నారు.

అంతేకాక ‘నా కుటుంబ సభ్యులు కొందరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాకు సమర్థులైన, తెలివైన, డైనమిక్‌, బైపోలార్‌ డిజార్డర్‌, డిప్రెషన్‌తో బాధపడుతున్న ఇలా వేర్వేరు రకాల స్నేహితులు ఉన్నారు. వారి స్నేహం, జ్ఞానం నన్ను ధనవంతురాలిని చేసింది’ అంటూ లేఖలో పేర్కొన్నారు.