Asianet News TeluguAsianet News Telugu

UP Elections 2022: యూపీలో బీజేపీ క‌ష్టాలు.. 80 మంది సిట్టింగ్ ల‌కు నో టిక్కెట్ !

UP Elections 2022: యూపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అయితే, వరుసగా రెండో సారి అధికారం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న బీజేపీకి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. సీఎం యోగిపై ఉన్న అసంతృప్తితో  పాటు స్థానికంగా ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ నేప‌థ్యంలో బీజేపీ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డానికి సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ నిరాక‌రించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. 

BJP draws up more names for UP, may drop 80 MLAs
Author
Hyderabad, First Published Jan 25, 2022, 1:39 PM IST

UP Assembly Election 2022: వ‌చ్చే నెల‌లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఈ  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అన్ని ప్ర‌ధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో యూపీ రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి.  అయితే, ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నత‌రుణంలో ప‌లు చోట్ల ప‌లువురు నేత‌ల‌కు చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఇదివ‌ర‌కు ఎన్నుకున్నందుకు ఏం చేశారంటూ ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు స్థానికంగా తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ది. దీంతో ఇప్ప‌టికే పార్టీని వీడిన కీల‌క నేత‌లతో ఇబ్బందులు ప‌డుతున్న బీజేపీకి ప్ర‌స్తుతం అధిక సంఖ్య‌లోని సిట్టింగ్ ఎమ్మెల్యేల‌తో మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 

యూపీలో ప్ర‌స్తుత ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే.. వ‌రుస‌గా రెండో సారి అధికారం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న బీజేపీకి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. సీఎం యోగిపై ఉన్న వ్య‌తిరేక‌త‌తో పాటు స్థానికంగా ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తి నేప‌థ్యంలో బీజేపీ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డానికి సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ నిరాక‌రించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో అన్ని పార్టీలు అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ త్వరలో చివరి అభ్యర్ధుల జాబితా విడుదల  చేయ‌డానికి సిద్ధ‌మైంది. అయితే, దాదాపు 80 మంది సిట్టింగ్ లను మార్చేందుకు బీజేపీ నేతలు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే, మరో 12 స్ధానాల్లో అభ్యర్ధుల్ని ఇతర నియోజ‌క‌వ‌ర్గాల‌కు మార్చ‌డానికి ప్ర‌ణాళిక సిద్ధం చేసింద‌ని సంబంధిత వ‌ర్గాల స‌మాచారం.

యూపీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల జాబితాను సిద్ధం చేయ‌డానికి సోమ‌వారం నాడు ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ స‌మావేశ‌మైంది. ఈ క్ర‌మంలోనే 80 మంది సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు ఇవ్వ‌కూడద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్య‌మంత్రి  యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే  ఈ కమిటీ సిద్ధం చేసిన జాబితాకు తుది ఆమోదం తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాలకు గాను 380 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, మిగిలిన స్థానాలను దాని మిత్రపక్షాలైన అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీకి సీట్లు కేటాయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. యూపీలో ఏడు దశల ఎన్నికలలో చివరి మూడు దశల కోసం ఇప్ప‌టికే అభ్య‌ర్థుల పేర్లు ఖరారు చేయబడ్డాయి. ఇందులో 172 స్థానాలు ఉన్నాయి. కాగా, బీజేపీ ఇప్ప‌టికే ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే 197 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios