బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకి మరో ప్రమాదం తప్పింది. ఇటీవల  మిజోరం పర్యటనకు వెళ్లిన అమిత్‌ షా.. హెలికాఫ్టర్‌ మెట్లు దిగుతుండగా జారిపడిన సంగతి తెలిసిందే. కాగా.. మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. 

అశోక్‌నగర్‌లో నేడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న షా ప్రసంగం ముగించుకొని వేదిక మెట్లు దిగుతూ ఒక్కసారిగా జారి పడ్డారు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పైకి లేపారు. ఈ ఘటనలో షాకి ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం తాను బాగానే ఉన్నానని అక్కడి వారితో అమిత్‌షా తెలిపారు. 

అమిత్‌ షా కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌ అవుతోంది. ఈ రెండు ప్రమాదాలు..అమిత్ షా ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు జరగడం విశేషం.