అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ వేస్తున్న అడుగులు Akhilesh Yadav పార్టీని మరింతగా ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్హల్ నియోజకవర్గం (Karhal constituency) నుంచి బరిలో నిలిచిన Akhilesh Yadavపై ఆయన సమీప బంధువు అపర్ణ యాదవ్‌ను బీజేపీ బరిలో నిలిపే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.  

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక వేళ రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమీప బంధువు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరడంతో సమాజ్‌వాద్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ వేస్తున్న అడుగులు Akhilesh Yadav పార్టీని మరింతగా ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అఖిలేష్.. మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం (Karhal constituency) నుంచి బరిలో నిలవనున్నారు. మెయిన్‌పురి.. సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక, కర్హల్ స్థానంలో అఖిలేష్‌పై పోటీగా కాంగ్రెస్ జ్ఞానవతి యాదవ్‌ను, బీఎస్‌పీ కుల్దీప్ నారాయణ్‌ను పోటీలోకి దింపాయి. ఇక్కడ మూడోదశలో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి 1 అఖరి తేదీ.

అయితే బీజేపీ మాత్రం అఖిలేష్ బరిలో నిలిచే కర్హల్ స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కర్హల్ నుంచి అఖిలేష్ యాదవ్‌కు ‌ధీటైన అభ్యర్థిని నిలపాలని బీజేపీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే అక్కడి నుంచి ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్‌ను బీజేపీ బరిలో దింపే అవకాశం ఉన్నట్టుగా యిన్‌పురి, పరిసర ప్రాంతాల్లో చర్చ కూడా సాగుతోంది. ఇది ఇలా ఉంటే.. ఓ ప్రైవేట్ న్యూస్ చానల్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న అపర్ణ.. కర్హల్ సీటు నుంచి పోటీ చేసే అవకాశాలను తోసిపుచ్చకపోవడం గమనార్హం. 

అపర్ణ మాట్లాడుతూ.. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తాను కర్హల్ స్థానం నుంచి పోటీ చేసేందకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. ‘నేను లక్నో కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేస్తున్నాను. పార్టీ చెబితే అఖిలేష్ భయ్యాపై కూడా పోటీ చేస్తాను. నేను ఏం చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. సమాజ్‌వాద్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత మా మామ ములాయం సింగ్ యాదవ్‌కు కోపం రాలేదు. ఆయన నన్ను కూడా ఆశీర్వదించారు’ అని అపర్ణ పేర్కొన్నారు. అఖిలేష్ యాదవ్‌పై అపర్ణ యాదవ్ పోటీ చేస్తే.. కర్హల్‌లో పోటీ చాలా ఆసక్తికరంగా మారనుంది. 

ఇక, కర్హల్‌ నుంచి బరిలో నిలుస్తున్న అఖిలేష్ యాదవ్‌.. సోమవారం (జనవరి 31) రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల గడువు ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ వేగంగా పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. రేపటిలోగా కర్హల్‌లో పోటీ చేసే అభ్యర్థిపై బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

అపర్ణ యాదవ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె బీజేపీకి చెందిన రీటా బహుగుణ జోషి చేతిలో ఓటమి పాలయ్యారు.