తమిళనాడులోని కున్నూరు సమీపంలో బుధవారం హెలికాఫ్టర్ కూలిన దుర్ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat), ఆయన భార్య మధులికా రావత్ (Madhulika Rawat) సహా 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.  తాజాగా ప్రమాదం జరిగిన స్థలంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన వైమానిక దళ అధికారుల ప్రత్యేక బృందం బ్లాక్ బాక్స్‌ను (Black box) స్వాధీనం చేసుకుంది. 

తమిళనాడులోని కున్నూరు సమీపంలో బుధవారం హెలికాఫ్టర్ కూలిన దుర్ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat), ఆయన భార్య మధులికా రావత్ (Madhulika Rawat) సహా 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం చేరుకున్న భద్రత బలగాలు.. ముందుగా రక్షణ చర్యలు చేపట్టాయి. మృతదేహాలను వెలికితీయడంతో పాటు, ఎవరైనా గాయాలతో బయటపడితే వారిని ప్రాణాలతో రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (group captain varun singh) ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనకు ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.


అయితే గురువారం ఉదయం నుంచి హెలికాఫ్టర్‌లో ఉండే బ్లాక్ బాక్స్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వింగ్ కమాండర్ ఆర్ భరద్వాజ్ నేతృత్వంలోని 25 మంది వైమానిక దళ అధికారులు.. ప్రమాద స్థలానికి 300 మీటర్ల నుంచి ఒక కి.మీ ప్రాంతంలో బ్లాక్ బాక్స్‌ కోసం వెతికారు. ఈ క్రమంలోనే ప్రత్యేక బృందం బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకుంది. అనంతరం ఆర్మీ అధికారులు బ్లాక్ బాక్స్‌ను విశ్లేషణ కోసం ఢిల్లీకి తరించారు. ఇక, ప్రమాదం జరిగిన స్థలానికి 30 అడుగుల దూరంలో Black box దొరికినట్టుగా తెలుస్తోంది. అందులో పైలట్ల సంభాషణ రికార్డు అయ్యే అవకాశం ఉంది. బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ ఆధారంగా.. సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏవిధంగా ప్రమాదానికి గురైందో తెలిసే అవకాశం ఉంటుంది. ప్రమాద విచారణలో బ్లాక్ బాక్స్ కీలకంగా మారే చాన్స్ ఉంది. 

Also read: CDS Bipin Rawat: రేపు బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎయిర్‌ఫోర్స్ చీఫ్

అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి.. 
సాధారణంగా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్‌ కోసం అన్వేషణ కొనసాగిస్తుంటారు. ఇందులో డేటా విశ్లేషణ ద్వారా విచారణ జరుపుతుంటారు. బ్లాక్ బాక్స్ అనేది ప్రమాదానికి ముందు వరకు విమానంలో ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రమాదం జరిగి మంటల చెలరేగిన కూడా బ్లాక్ బాక్స్‌ను ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా చూస్తారు. అంతేకాకుండా ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్‌ను సులువుగా గుర్తించే నారింజ రంగులో ఉంచుతారు. 

బ్లాక్ బాక్స్‌లో విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి ప్రతి మూమెంట్ రికార్డు అవుతుంది. విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, వేగం ఎంత ఉంది.. ఇలా ప్రతి విషయాన్ని రికార్డు చేస్తాయి. అంతేకాకుండా ఫైలట్లకు సంబంధించిన ప్రతి సంభాషణ ఇందులో రికార్డు అవుతుంది. తద్వారా ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే దానిపై బ్లాక్ బాక్స్‌ డేటా విశ్లేషణ ఆధారంగా బయటపడే చాన్స్ ఉంది.