పాట్నా: ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. మూడో విడత ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

గురువారం నాడు బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజకీయాల నుండి రిటైర్మెంట్ ను ప్రకటించారు.అంతిమ విజయం అందరికి మంచి జరుగుతోందని ఆయన ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్నారు. మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఎల్లుండి మూడో విడత పోలింగ్ జరగనుంది. మూడో విడత పోలింగ్ కు ఇవాళ ప్రచారం ముగిసింది. 

తమ పార్టీ విజయాన్ని నిర్ధారించాలని ఓటర్లకు విన్నవించారు. రాష్ట్రంలోని పూర్ణియాలో ఇవాళ నిర్వహించిన ఎన్నికల సభలో ఈ సంచలన ప్రకటన చేశారు.

నితీష్ కుమార్ తన ఎన్నికల ప్రచారా సభల్లో పలు నిరసనలను ఎదుర్కొంటున్నారు.ఈ వ్యాఖ్యలపై ఎల్ జే పీ నేత అజయ్ కుమార్ స్పందించారు.  జేడీ(యూ) తరపున సీఎం అభ్యర్ధి ఎవరో చెప్పాలని ఆయన ప్రకటించారు.

రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా కుమార్  ఈ వ్యాఖ్యలపై స్పందించారు.  తనకు ఇవే చివరి ఎన్నికలుగా ప్రకటించిన నితీష్ కుమార్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల నుండి విరమించుకోవాలని ఆయన కోరారు.

ఈ ప్రకటనను రాజకీయ జిమ్మిక్కుగా కాంగ్రెస్ అభిప్రాయపడింది. సెంటిమెంట్ తో ఓట్లు రాల్చుకొనేందుకు నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ అభిప్రాయపడింది.

తాను ఓడిపోతున్నానని గ్రహించి నితీష్ కుమార్ ఈ ప్రకటన చేశారని కాంగ్రెస్ పార్టీ బీహార్ అధ్యక్షుడు ప్రకటించారు.