మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఫడ్నవీస్‌కు భంగపాటు.. శాసన మండలి ఎన్నికలో నాగ్‌పూర్ నుంచి ఎంవీఏ గెలుపు
మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్ నాగ్‌పూర్‌లో ఎంవీఏ విజయఢంకా మోగించింది. బీజేపీ మద్దతున్న అభ్యర్థి ఓటమిపాలయ్యాడు. రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి ప్రముఖ నేతలకు కంచుకోటగా ఉండే నాగ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఓడిపోవడం సంచలనంగా మారింది.

ముంబయి: మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ మద్దతు అభ్యర్థిపై మహా వికాస్ అఘాది మద్దతుగల అభ్యర్థి విజయఢంకా మోగించారు. అదీ నాగ్‌పూర్ నుంచి గెలవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి భావజాల మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్, ఎందరో బీజేపీ నేతలకు రాజకీయ ప్రస్థానాన్ని అందించడానికి దోహదపడిన నాగ్‌పూర్‌లో బీజేపీపై ఎంవీఏ పై చేయి సాధించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వంటి ప్రముఖులకు నాగ్‌పూర్ కంచుకోటగా ఉన్నది. ఇలాంటి కంచుకోటలో ఎంవీఏ అభ్యర్థి గెలుపు జెండా ఎగరేయడం రాజకీయంగా దుమారం రేపింది. రాష్ట్రంలో ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా వైదొలిగిన తర్వాత ఏక్‌నాథ్ షిండే శివసేన, బీజేపీల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు ఇవే.
Also Read: సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 87% మంది కోటీశ్వరులు, 43% మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్ రిపోర్ట్
శాసన మండలిలో ఐదుగురు సభ్యుల ఆరేళ్ల పదవీ కాలం ఫిబ్రవరి 7వ తేదీతో ముగుస్తున్నది. ఇందులో ముగ్గురు టీచర్స్, ఇద్దరు గ్రాడ్యుయేట్స్ కాన్‌స్టిట్యుయేషన్ నుంచి గెలుపొందినవారు. ఈ సీట్లను భర్తీ చేయడానికి సోమవారం ఎన్నికలు జరిగాయి.
నాగ్‌పూర్‌లో టీచర్స్ సీటు నుంచి ఎంవీఏ తరఫున సుధాకర్ అద్బాలే.. బీజేపీ మద్దతున్న నాగో గనార్ అభ్యర్థిపై విజయం సాధించారు.
టీచర్స్ కాన్‌స్టిట్యుయెన్సీలైన ఔరంగాబాద్, నాగ్‌పూర్, కొంకణ్ డివిజన్లలో 86 శాతం, 86.23 శాతం, 91.02 శాతం వోటింగ్ నమోదైంది.