డంపర్‌ను ఢీకొని బస్సుకు మంటలు.. 12 మంది సజీవ దహనం..
మధ్యప్రదేశ్‌లోని గుణాలో పెను ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి గుణ నుంచి ఆరోన్ వైపు బస్సు డంపర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. 12 మంది సజీవ దహనమయ్యారు. అక్కడ దాదాపు 14 మంది కాలిపోయారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. డంపర్, బస్సు ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి పలువురు ప్రయాణికులు కాలిపోయారు. మంటల్లో 12 మంది చనిపోయారు. సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తుల ప్రకారం.. 11 మృతదేహాలను వెలికి తీశారు. ఈ విషయాన్ని ఎస్పీ విజయ్ ఖత్రీ కూడా ధృవీకరించారు. తీవ్రంగా కాలిపోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
జాతీయ మీడియా సమాచారం మేరకు బుధవారం రాత్రి ఓ బస్సు గుణ నుంచి ఆరోన్ వైపు వెళుతోంది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుణ జిల్లాలో డంపర్‌ను ఢీకొనడంతో బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో 12 మంది సజీవ దహనమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలా మందికి గాయాలయ్యాయి. స్థానికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన గంట వరకు అంబులెన్స్ గుణ, ఆరోన్‌లకు చేరుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. బస్సులో మంటలు చెలరేగడంతో ఘటనా స్థలంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు జనాన్ని తొలగిస్తూనే ఉన్నారు.
ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం
గుణ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ విచారణకు ఆదేశించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున సాయం అందించాలని ముఖ్యమంత్రి డాక్టర్ యాదవ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
బస్సులో ఉన్న ప్రయాణీకుడు, ప్రత్యక్ష సాక్షి అంకిత్ కుష్వాహా మాట్లాడుతూ.. బస్సు గుణ నుండి ఆరోన్ వైపు వెళుతోంది. నేను ముందు సీటులో కూర్చున్నాను, అది అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. అప్పుడు నాకేమీ అర్థం కాలేదు. నా కళ్ళు మూసుకుని ఉన్నాయి, నేను వాటిని తెరవగానే, నేను గ్లాస్ నుండి బయటకి వచ్చాను. నా స్నేహితుడు, నేను ముగ్గురు నలుగురు వ్యక్తులను బయటకు తీసాము. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగడంతో బస్సులో నుంచి ఎవరూ బయటకు రాలేకపోయారు. నా సమాచారం ప్రకారం బస్సులో దాదాపు 8 మంది సజీవ దహనమయ్యారు. అది సికార్వార్ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. సెమ్రీ సమీపంలో ఈ సంఘటన జరిగింది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు అని తెలిపారు.
సింధియా విచారం
ఘటనపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారం వ్యక్తం చేశారు. గుణ ఆరోన్ రోడ్డులో ప్రయాణీకుల బస్సులో మంటలు చెలరేగడం బాధాకరమని ట్వీట్ చేస్తూ రాశారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే గుణ కలెక్టర్‌తో ఫోన్‌లో చర్చించి తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాలని సూచించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ఈ లోటును భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ప్రమాదంలో గాయపడిన పౌరులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.