తల్లిదండ్రులను కాదని ప్రియుడితో  పరారయ్యింది. పేరెంట్స్... పోలీసులను ఆశ్రయిస్తే... తాను మేజర్ నని చెప్పింది. ప్రియుడితోనే తన జీవితం అని తేల్చిచెప్పింది. చివరకు ఓ హోటల్ వద్ద శవమై తేలింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం అరుకలగూడు ప్రాంతానికి చెందిన భవిత(23)... గత కొంతకాలంగా పునీత్ అనే యువకుడిని ప్రేమిస్తోంది.  అతనినే పెళ్లి చేసుకోవాలని భావించింది. అందుకు తల్లిదండ్రులు అంగీకరించరని తెలిసి.... ఇంట్లో నుంచి పరారయ్యింది. ఆమెకు 18 సంవత్సరాల వయసులోనే ఇంట్లో నుంచి ప్రియుడితో పరారవ్వడం గమనార్హం.

కాగా... తమ కూతురు కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా... ఆమెను వెతికి పట్టుకున్నారు. కాగా... తాను తాను మేజర్‌నని, తన ప్రేమికుడితోనే ఉంటానని వెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఈ యువతిని తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు. 

ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం హాసన్‌ పట్టణంలో ఉన్న సరయు హోటల్‌ వెనుక భాగంలో యువతి మృతదేహం ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని హత్య చేశారా, ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో  దర్యాప్తు చేస్తున్నారు.

యువతి చేయిపై పునీత్‌ అనే పేరుతో పచ్చబొట్టు ఉంది. అతే కాకుండా ఇప్పటి వరకు సుమారు ముగ్గురు యువకులను భవిత ప్రేమించినట్లు పోలీసుల విచారణలో తేలింది. 12 రోజులకు ముందు ఇక్కడికి వచ్చిన భవిత ఇదే హోటల్లో దిగింది. తాను ఇదే హోటల్‌ గదిలో ఉన్నట్లు  తన ఫేస్‌బుక్‌ స్టేటస్‌లో ఫొటోలను కూడా అప్‌లోడ్‌ చేసింది. 

శనివారం రాత్రి కూడా భవిత పునిత్‌తో కలిసి హోటల్‌ రూంకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ధ్రువీకరించారు. కాగా ఆదివారం ఉదయం భవిత హోటల్‌ వెనుకాల విగతజీవిగా పడి ఉంది. ఆమె చావు మిస్టరీగా మారింది. కాగా కూతురి మరణ వార్త విని ఆమె తల్లిండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.