పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ఎంపీ అర్జున్ సింగ్ సన్నిహితుడు, టిటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా హత్యకు నిరసనగా బీజేపీ సోమవారం 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు.  ఘటనపై ట్విట్టర్‌లో స్పందించిన రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకార్.. స్టేట్ హోం సెక్రటరీ,డీజీపీలతో సోమవారం ఉదయం 10గంటలకు రాజ్‌భవన్ లో సమావేశమయ్యారు. 

బరాక్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశం అనంతరం ఆదివారం రాత్రి 8.30గంటల సమయంలో శుక్లా,ఇతర బీజేపీ నేతలతో కలిసి బయటకొచ్చారు. దగ్గర్లోని ఓ టీ స్టాల్ వద్ద అంతా కలిసి టీ తాగుతుండగా.. అకస్మాత్తుగా ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి శుక్లాపై కాల్పులు జరపగా, తీవ్రంగా గాయపడ్డ శుక్లా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఛాతి,నుదుటి భాగాల్లో బుల్లెట్లు దిగాయి. 

హుటిహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దుండగులు ముఖాలకు మాస్కులు ధరించి వచ్చినట్లు బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. 

'రాత్రి 7.30గం. వరకూ శుక్లా నాతోనే ఉన్నారు. టిటాగర్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఆయనపై 12 రౌండ్ల కాల్పులు జరిగాయి. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. తను నా ఆప్త మిత్రుడు... పోలీసుల ఎదుటే చంపబడ్డాడు..' అని అర్జున్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య తృణమూల్ కాంగ్రెస్ పనే అని ఎంపీ అర్జున్ సింగ్  ఆరోపించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్, పోలీసులు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా ఈ ఘటనపై ట్విట్టర్‌లో స్పందిస్తూ... శుక్లా హత్యకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులను నియమించిందని ఎంపీ అర్జున్ సింగ్ మొదటినుంచి చెప్తూనే ఉన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరగాలి... ఇందులో పోలీసుల పాత్ర తేలాలి...' అన్నారు. అధికార పార్టీనే నేరస్తులకు ఆశ్రయం కల్పించి హత్యలకు ప్రేరేపిస్తోందని బీజేపీ సీనియర్ నేత అరవింద్ మీనన్ ఆరోపించారు

బీజేపీలో అంతర్గత కుమ్ములాటలే ఈ హత్యకు దారితీశాయని... అది అందరికీ తెలుసునని టీఎంసీ నేతలు బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చారు. టీఎంసీపై బురదజల్లేందుకే బీజేపీ ఈ ఆరోపణలు చేస్తోందన్నారు. కాగా,2019లో బీజేపీలో చేరేంతవరకు శుక్లా టీఎంసీలోనే ఉన్నారు. అర్జున్ సింగ్ బీజేపీలో చేరడంతో ఆయన కూడా అదే పార్టీలోకి వెళ్లారు. 2018లోనూ ఆయనపై దాడి జరిగింది. గతంలో ఆయన టిటాగర్ వ్యాగన్ ఫ్యాక్టరీ సూపర్‌వైజర్‌గా పనిచేశారు.