Bengal Assembly: బెంగాల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
Bengal Assembly: సభలో నిబంధనలను ఉల్లంఘిస్తూ.. వికృతంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ సస్పెండ్ చేశారు. సువేందు అధికారితో పాటు బీజేపీ శాసనసభ్యులు దీపక్ బర్మన్, శంకర్ ఘోష్, మనోజ్ తిగ్గ, నరహరి మహతోలను ఈ ఏడాది జరిగే సమావేశాలకు హాజరు కాకుండా సస్పెన్షన్ విధించారు.
ఇదిలావుండగా, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఈ రోజ రణరంగాన్ని తలపించింది. బీర్ భూం సజీవదహనాల ఘటనపై అధికారపార్టీ, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. చివరకు ఒకర్నొకరు కొట్టుకునేదాకా వెళ్లింది. ఈ ఘర్షణలో పలువురు ఎమ్మెల్యేలు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్ట వైరల్ గా మారాయి.
ఇక బీజేపీ నేతలు అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు. బీర్‌భూంలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎనమిది మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో చర్చకు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర శాంతిభద్రతల విషయంపై సీఎం మమతాబెనర్జీ సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఘర్షణకు దారి తీసింది. పలువురు నేతలు కొట్టుకున్నారు.
ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి నేతృత్వంలోని దాదాపు 25 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు. పలువురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు.. సభలోపల తమను దూషించారని ఆరోపించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండాపోయిందన్నారు. బీజేపీ వ్యాఖ్యలను ఖండించింది తృణమూల్ కాంగ్రెస్. అసెంబ్లీలో గందరగోళం సృష్టించేందుకు బీజేపీ డ్రామాలు ఆడుతోందని టీఎంసీ నేత, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ అన్నారు. సభలో జరిగిన తోపులాటలో కొందరు తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యులు గాయపడ్డారని కూడా ఆయన చెప్పారు.
మరోవైపు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా.. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏమి దాచాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి ఓ వీడియోను అమిత్ మాల్వియా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
