Asianet News TeluguAsianet News Telugu
breaking news image

బసవరాజ్ బొమ్మై : బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

పార్టీని, ప్రభుత్వాన్ని ఎన్నికల వరకు సమర్ధవంతంగా నెట్టుకొచ్చిన బసవరాజ్ బొమ్మై మరోసారి సీఎం అవుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బొమ్మై తండ్రి ఎస్ఆర్ బొమ్మై జనతా పరివార్‌కు చెందిన వ్యక్తి. 1988-89 మధ్యకాలంలో కర్ణాటకకు 11వ ముఖ్యమంత్రిగా పనిచేశారు.  జనతాదళ్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు బసవరాజ్ బొమ్మై . జనతాదళ్ (యునైటెడ్) నుంచి నిష్క్రమించి ఫిబ్రవరి 2008లో బీజేపీలో చేరారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో హోంమంత్రిగా వున్న బసవరాజ్.. తన నివాసాన్నే కోవిడ్ కేర్ సెంటర్ (సీసీసీ)గా మార్చారు. దేశంలో తొలిసారిగా షిగ్గావ్ ప్రాంతంలో 100 శాతం నీటిపారుదల ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేశారు.

basavaraj bommai biography childhood family education political life net worth key facts ksp
Author
First Published Apr 4, 2024, 3:26 PM IST

బసవరాజ్ బొమ్మై.. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప అనూహ్య నిష్క్రమణ తర్వాత పగ్గాలు అందుకున్న నేతగా ఆయన దేశ ప్రజలకు సుపరిచితం. పార్టీని, ప్రభుత్వాన్ని ఎన్నికల వరకు సమర్ధవంతంగా నెట్టుకొచ్చిన ఆయన మరోసారి సీఎం అవుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హవేరి నుంచి బసవరాజ్ బొమ్మై బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బాల్యం, విద్యాభ్యాసం , రాజకీయ ప్రస్థానం గురించి పరిశీలిస్తే.

బసవరాజ్ బొమ్మై బాల్యం, విద్యాభ్యాసం :

బొమ్మై తండ్రి ఎస్ఆర్ బొమ్మై జనతా పరివార్‌కు చెందిన వ్యక్తి. 1988-89 మధ్యకాలంలో కర్ణాటకకు 11వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జనవరి 28, 1960లో హుబ్లీలో జన్మించిన బసవరాజ్.. మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. పుణేలోని టాటా మోటార్స్‌లో మూడేళ్ల పాటు పనిచేసి పారిశ్రామికవేత్తగానూ ఎదిగారు. కర్ణాటకలో ఆధిపత్య వీరశైవ లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి బొమ్మై.. ఈ సామాజికవర్గం రాష్ట్ర జనాభాలో 16 నుంచి 17 శాతం వుంది. వీరు తొలి నుంచి బీజేపీకి గట్టి మద్ధతుదారులుగా వున్నారు. జనతాదళ్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బసవరాజ్ బొమ్మై.. ధార్వాడ్ లోకల్ అథారిటీస్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి జేహెచ్ పటేల్‌కు రాజకీయ కార్యదర్శిగా, మండలిలో ఉప ప్రతిపక్షనేతగానూ బొమ్మై పనిచేశారు. 

బసవరాజ్ బొమ్మై రాజకీయ ప్రస్థానం :

బొమ్మై.. జనతాదళ్ (యునైటెడ్) నుంచి నిష్క్రమించి ఫిబ్రవరి 2008లో బీజేపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హవేరి జిల్లా షిగ్గావ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 2013, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా అక్కడి నుంచి విజయాలు సాధించారు. యడియూరప్ప కేబినెట్‌లో జలవనరులు, సహకార శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఆయనకున్న అవగాహన ప్రశంసలు కురిపించింది. 

పుస్తకాలు చదవడం, కవితలు రాయడం, గోల్ఫ్ , క్రికెట్‌ను బొమ్మై ఎంతగానో ఇష్టపడతారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ధార్వాడ్ , కర్ణాటక వాలీబాల్ అసోసియేషన్ , ధార్వాడ్ జిల్లా ఛైర్మన్‌గానూ బొమ్మై పనిచేశారు. అరుణోదయ కో ఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపకుడిగా.. జయనగర్ హౌసింగ్ సొసైటీ, జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడిగానూ సేవలందించారు. బొమ్మై.. చెన్నమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె వున్నారు. 

అనూహ్యంగా సీఎం పగ్గాలు :

కరోనా సమయంలో బొమ్మై పెద్ద మనసు చాటుకున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో హోంమంత్రిగా వున్న బసవరాజ్.. తన నివాసాన్నే కోవిడ్ కేర్ సెంటర్ (సీసీసీ)గా మార్చారు. దేశంలో తొలిసారిగా షిగ్గావ్ ప్రాంతంలో 100 శాతం నీటిపారుదల ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేశారు. అనివార్య పరిస్ధితుల్లో యడియూరప్ప రాజీనామా చేయడంతో ఆయన వారసుడెవరు అన్న చర్చ నడుస్తున్న పరిస్ధితుల్లో బొమ్మై అనూహ్యంగా తెరపైకి వచ్చి కర్ణాటక సీఎంగా పగ్గాలు అందుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios