న్యూఢిల్లీ:  బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం బుధవారం నాడు తుది తీర్పును వెల్లడించనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కేసు విచారణకు హాజరుకావాలని సీబీఐ జడ్జి ఆదేశించారు.

వీడియో కాల్ ద్వారా ఈ కేసు విచారణను కొనసాగించనున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రులు అద్వానీ, మురళీ మనోహార్ జోషీ, ఉమాభారతి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్, సాధ్వి రితంబర లు విచారణకు హాజరు కానున్నారు.

మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతికి కరోనా సోకింది. దీంతో ఆమె క్వారంటైన్ లో ఉన్నారు. ఆమె ఈ కేసు విచారణకు హాజరౌతారో లేదా ఇంకా స్పష్టత రాలేదు.

1992 డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో బాబ్రీ మసీదును  కరసేవకులు కూల్చివేశారు.  ఈ కేసును సీబీఐ విచారించింది. 351 మంది సాక్షుల్ని విచారించింది సీబీఐ. 600 డాక్యుమెంట్లను కోర్టు ముందు ప్రవేశపెట్టింది.  48  మందిపై అభియోగాలను మోపింది.


ఈ కేసు విచారణను సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్ ఇవాళ తీర్పును వెలువర్చనున్నారు.

అనారోగ్య కారణాలతో మాజీ కేంద్ర మంత్రులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహార్ జోషీలు విచారణకు హాజరు కాలేమని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపారు. 

బాబ్రీ మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరిగిందని సీబీఐ ఆరోపించింది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశ వ్యాప్తంగా అల్లర్లు చేలరేగాయి. ఈ ఘటనలో సుమారు 3 వేల మంది మరణించినట్టుగా అంచనా.దీంతో యూపీలో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 

మాజీ కేంద్ర మంత్రి ఎల్ కే అద్వానీ ఈ ఏడాది జూలై 24న తన స్టేట్ మెంట్ ను వీడియో కాల్ ద్వారా సీబీఐ కోర్టుకు వినిపించారు. సుమారు 100 ప్రశ్నలను సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి అతడిని అడిగారు.

అద్వానీ కంటే ముందురోజున సీబీఐ కోర్టు మురళీ మనోహార్ జోషీ స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేసింది.1993లో సీబీఐ 48 మందిపై ఒకే చార్జీషీట్ దాఖలు చేసింది. ఇందులో యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ తో పాటు శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాకరే పేర్లను చేర్చారు.