JP Nadda: ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ సాధించిన విజ‌యం చూసి..  కొంత మంది రాజకీయాల్లో చలించిపోయారు. అందుకే .. వారు ఆవేశంతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జ‌రుగుతోంద‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆరోపించారు. కాంగ్రెస్, అవినీతి కవలలని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నా కమిషన్ ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం కర్ణాటకలోని హొసపెటెలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో కేంద్రంలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

JP Nadda: ఇటీవల రామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా చేపట్టిన యాత్రల సందర్భంగా జరిగిన మతపరమైన హింసను సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి జ‌రుగుతోన్న కుట్ర‌గా అని బిజెపి చీఫ్ జెపి నడ్డా విమ‌ర్శించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆయ‌న రెండు రోజుల పాటు క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం హోసపేటలో పార్టీ కార్యకర్తలతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై విరుచుక‌ప‌డ్డారు. రామనవమి ఊరేగింపుపై దాడి.. దేశాన్ని విభజించే మార్గమని అన్నారు.

ఈ దాడుల‌ను ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌తో ముడిపెట్టారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో బీజేపీ చారిత్రాత్మక విజ‌యం సాధించింద‌నీ, ఆ ప్ర‌జా విజ‌యంతో కొంత మంది ఉలిక్కిపడ్డారని ఎద్దేవా చేశారు. అందుకే.. నిరాశతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు.. కుట్ర జ‌రుగుతోంద‌నీ, విచ్చ‌న్న శ‌క్తుల‌తో ప్ర‌ధాన పార్టీలు చేతులు క‌లిపార‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌పై 
విమ‌ర్శాస్త్రాలు సంధించారు. 

రాష్ట్రంలో సిద్ధరామయ్య ప్రభుత్వం.. చాలా మంది పిఎఫ్‌ఐ సభ్యులను విడుదల చేసిందని ఆరోపించారు. కానీ బీజేపీ ప్ర‌భుత్వం దేశ విచ్చిన్న‌కారుల‌పై ఉక్కుపాదం మోపింద‌నీ, వారిపై బీజేపీ ప్రభుత్వం క‌ఠిన చర్యలు తీసుకుంటుందని నడ్డా అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులను వదిలేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అంతర్గతంగా విచ్ఛిన్నమయ్యే శక్తులతో స్నేహం చేస్తుందనీ, కానీ బయట నటిస్తుందని ఆరోపించారు. ఆ ఆధారాల‌ను త్వ‌రలోనే బ‌హిర్గతం చేస్తామ‌ని న‌డ్డా తెలిపారు.

అవినీతి, కాంగ్రెస్ లు రెండు పర్యాయపదాలని విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎక్కడ ఉన్నా మిషన్ ఉంటుందని, అదే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నా కమిషన్ ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి, కాంగ్రెస్ లు ఒక నాణేనికి ఉన్న రెండు ముఖాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 70 ఏళ్లు పాలించి..లూటీ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీ నేతలపై ఎప్పుడూ అవినీతి ఆరోపణలే వ‌చ్చేవ‌నీ.. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతి క‌నిపించ‌డం లేద‌ని, ప్రజా సంక్షేమం, ప్రజా అవసరాలను తీర్చడమే బీజేపీ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు.