తమిళనాడులో దారుణం జరిగింది. ఫోన్ దొంగలించాడనే అనుమానంతో స్నేహితులంతా కలిసి మరో స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆ యువకుడు తరువాత చనిపోయాడు. ఈ ఘటన కాంచీపురం జిల్లాలో చోటు చేసుకుంది.
ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో ఓ యువకుడిని అతడి స్నేహితులే చితకబాదారు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ యువకుడు మృతి చెందాడు. ఈ అమానవీయ ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు 25 ఏళ్ల విజి బార్బర్ గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి తన నలుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగారు. అయితే ఈ క్రమంలో మద్యం తాగుతున్న స్నేహితుల్లో ఒకరి ఫోన్ కనిపించకుండా పోయింది. దీంతో అతడు అక్కడే ఉన్న స్నేహితుల దగ్గర తన ఫోన్ గురించి ఆరా తీశారు. అయితే వారు విజి దొంగతనం తీసి ఉండొచ్చని చెప్పారు. ఇక్కడే ఈ సన్నివేశం ఒక్క సారిగా మలుపుతిరిగింది.
అంతా సేపు సరదాగా మద్యం తాగుతున్న నలుగురు స్నేహితులు కలిసి విజిని కారు ఎక్కించుకొని మేల్పొడవూరు ప్రాంతానికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు. తాను దొంగతనం చేయలేదని విజి చెప్పాడు. కానీ గంట సేపు అతడిని వారు అడిగారు. ఫోన్ ఎక్కడ ఉంచాడో తెలుసుకునేందుకు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. అనంతరం అతడిపై దాడి చేశారు. ఈ దెబ్బలు తట్టుకోలేకపోయిన విజి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడిని వారంతా విడిచి పెట్టారు.
అయితే విజి జాడ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నేరానికి పాల్పడి ఉంటారనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నాటకలో మరో ఘటన..
తమిళనాడులో చోటు చేసుకున్న విధంగానే కర్నాటకలోనూ మరో ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో సెల్ ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో కొంతమంది వ్యక్తులు తమ సహోద్యోగులలో ఒకరిని ఫిషింగ్ బోట్‌పై తలకిందులుగా కట్టివేసి కొట్టారు.అయితే ఈ ఘటన 2021 డిసెంబర్ 23న జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది వెలుగులోకి వచ్చింది.
