గౌహతి: అస్సాంలో మానవత్వం తల దించుకునే సంఘటన జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిని కాటేశాడు. రెండేళ్లుగా కూతురిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ సంఘటనపై ఆ వ్యక్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గౌహతిలో ఈ సంఘటన జరిగింది. 

పోలీసులు అందుకు సంబంధించిన వివరాలను అందించారు. భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇద్దరు కూడా వేర్వేరుగా ఉంటున్నారు. వారి 14 ఏళ్ల కూతురు తండ్రి వద్దనే ఉంటోంది. ఈ స్థితిలో కూతురిపై అతను అత్యాచారం చేయడం ప్రారంభించాడు. 

Also Read: రేప్ చేసి... కాళ్లూ చేతులూ కట్టేసి... బాలిక ఆత్మహత్య

తన తండ్రి నిర్వాకం గురించి బాలిక తన బంధువులకు చెప్పింది. బంధువుల ద్వారా విషయం తల్లికి తెలిసింది. దీంతో ఆమె సోమవారం గీతానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడని కేసు పెట్టింది. దాంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. కేసును విచారించిన కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రిపోర్టు రావాల్సి ఉంది.