జైపూర్: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారంరేపాయి. 2017లో గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో కుల సమీకరణాల రీత్యా రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేశారని ఆయన వ్యాఖ్యానించారు. 

2017లోని గుజరాత్ ఎన్నికల కారణంగానే కోవింద్ ను రాష్ట్రపతిని చేశారని ప్రజలు అంటున్నారని అశోక్ గెహ్లాట్ అన్నారు .తాను గుజరాత్ లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమనే భయంలో అప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారని, ఆ స్థితిలో రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేయాలని అమిత్ షా సలహా ఇచ్చారని ఆయన అన్నారు. 

కోవింద్ 2017 జులైలో రాష్ట్రపతి అయ్యారు. అదే ఏడాది డిసెంబర్ లో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రపతి కావాల్సిన ఎల్కే అద్వానీని పక్కన పెట్టారని గెహ్లాట్ మీడియాతో అన్నారు. అద్వానీకి రాష్ట్రపతి అయ్యే గోరవం దక్కుతుందని ప్రజలంతా భావించారని, అయితే అర్హత ఉన్నప్పటికీ అద్వానీని పక్కన పెట్టారని ఆయన అన్నారు. 

అదంతా బిజెపి అంతర్గత వ్యవహారం అయినప్పటికీ తాను ఓ ఆర్టికల్ చదివానని, అందువల్ల దాన్ని చర్చకు పెట్టానని ఆయన అన్నారు. 

అశోక్ గెహ్లాట్ ఈ దేశ రాష్ట్రపతిపై అన్యాయమైన వ్యాఖ్యలు చేశారని బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు అన్నారు. అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలు అంగీకార యోగ్యం కావని అన్నారు. దళిత సమాజంపై గెహ్లాట్ వ్యాఖ్యలు దాడి చేయడమేనని ఆయన అన్నారు.