NATIONALISM:  జాతీయవాదం నేర్చుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ RSS ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని BJP MP పర్వేశ్ వర్మ విమ‌ర్శించారు. అయినా సర్జికల్ స్ట్రైక్స్, 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా గురించి ప్రశ్నించిన  కేజ్రీవాల్ జాతీయవాది ఎలా అవుతారని వర్మ ప్రశ్నించారు. 

NATIONALISM: ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్దం కొన‌సాగుతోంది. ఏ చిన్న అంశం దొరికినా.. ఇరు పార్టీలు దాన్ని.. అవ‌కాశంగా మార్చుకుని మాటల యుద్ధం సాగిస్తున్నాయి. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ప్రతి చిన్న అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బీజేపీ కూడా అంతే.. ఏ చిన్న పొరపాటునైనా అవకాశంగా మార్చుకోవాలని చూస్తుంది. 

తాజాగా.. ఉత్తరప్రదేశ్ లో పదివేల తిరంగ శాఖలను ప్రారంభిస్తామ‌ని ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటనపై బీజేపీ స్పందిస్తూ..కేజ్రీవాల్ పై మండిపడింది. నిజమైన జాతీయత ఏంటో తెలుసుకోవాలంటే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్నిసంద‌ర్శించాల‌ని ఎంపీ పర్వేశ్ వర్మ సూచించారు. అక్క‌డ జాతీయవాదంపై మూడేళ్ల కోర్స్ చేయాలనీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని అనుసరిస్తే.. కేజ్రీవాల్ మంచి మనిషి అవుతారని BJP MP పర్వేశ్ వర్మ అన్నారు. కేవలం జాతీయ జెండా పట్టుకోవడం వల్ల జాతీయవాది కాలేరని బీజేపీ నేత అన్నారు. అయినా.. భారతదేశ సర్జికల్ స్ట్రైక్స్, 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా గురించి ప్రశ్నించిన తర్వాత, మిస్టర్ కేజ్రీవాల్ జాతీయవాది ఎలా అవుతారని వర్మ ప్రశ్నించారు.

జాతీయవాదం అనేది ఒక వ్యక్తి యొక్క హృదయం, మనస్సులో ఉంటుంద‌నీ, నకిలీ జాతీయవాదాన్ని వినిపిస్తున్న కేజ్రీవాల్..ఒక్కసారి ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శిస్తే.. మంచి మనిషిగా మారతాడని విమ‌ర్శించారు. ఇటీవల యూపీ, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తడబాటుకు గురైన కేజ్రీవాల్ నకిలీ జాతీయవాదాన్ని ప్రదర్శిస్తున్నారని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ అన్నారు. తాను ఏ మతానికి వ్యతిరేకిని కాదని, ప్రజలు తమ ఆచారాలను పాటించవచ్చని, అయితే ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని వర్మ అన్నారు.

శనివారం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జ్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. బిజెపిపై విరుచుక‌ప‌డ్డారు. బీజేపీ విభజించు, పాలించు విధానం అనుస‌రిస్తుంద‌ని ఆరోపించారు. బీజేపీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వచ్చే ఆరు నెలల్లో పార్టీ రాష్ట్రంలో 10,000 'తిరంగ శాఖ'లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

బీజేపీ విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తోందని సంజయ్ సింగ్ అన్నారు. బీజేపీ విదానాలు దేశాన్ని, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయ‌నీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే భారతదేశం తన గుర్తింపును కోల్పోతుందని విమ‌ర్శించారు. బీజేపీ విభజన విధానాలపై యూపీ, దేశ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పార్టీ 'తిరంగ శాఖల‌ను ప్రారంభించనుందని తెలిపారు. ఈ శాఖ‌ RSS లాగా త‌యారవుతుంద‌నీ, మరో ఆరు నెలల్లో ఈ శాఖ‌లు ఏర్పడనున్నాయి. యూపీలో పది వేల మంది శాఖాధిపతులను నియమించనున్నారు. ఈ వ్యక్తులు త్రివర్ణ శాఖను నడుపుతారు. జూలై నుంచి త్రివర్ణ పతాకాలు పనిచేయడం ప్రారంభిస్తాయి.