బీజేపీ అంటేనే మనకు గుర్తొచ్చేది మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్స్. హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రచారావాహికగా, సాంప్రదాయకవాద రాజకీయనాయకుల సమూహంగా మనకు కనపడుతుంది బీజేపీ పార్టీ  అలంటి బీజేపీలో డిఫరెంట్ గా మనకు కనపడే వ్యక్తి అరుణ్ జైట్లీ. అద్వానీ, సుష్మా, మురళి మనోహర్ జోషి వంటి గొప్పనాయకులతో సహా బీజేపీ అంతా ఒకలాగా కనిపిస్తే, అరుణ్ జైట్లీ ఒక్కరు మాత్రం వేరుగా కనపడతారు. బీజేపీ నాయకులకు ఉండే సహజ లక్షణాలు ఇతనిలో మనకు కనిపించవు. అన్ని పార్టీల కీలక నేతలతో సన్నిహిత సంబంధాలున్న అతికొద్ది మందిబీజేపీ నేతల్లో జైట్లీ ఒకరు. 

 

ఒకరకంగా చెప్పాలంటే మీడియా పరిభాషలో అసలు సిసలైన లటియన్స్ ఢిల్లీ నేత. అతని మార్నింగ్ వాక్ లో ఎందరో మిత్రులను పార్కులో కలుస్తూ మొదలయ్యే అతని రోజు, రకరకాల రంగాలకు చెందిన ఎందరో వ్యక్తులతో మాట్లాడుతూ సాగుతుంది. ఇలా అందరితో కలుపుగోలుగా మాట్లాడే తత్వం, చతురతతో పార్టీలకు అతీతంగా అతనికి మిత్రులున్నారు. ఈయనకున్న పరిచయాలు, సన్నిహిత సంబంధాలు 2014లో మోడీ, అమిత్ షాలకు ఎంతో ఉపయుక్తకరంగా మారాయి. 

 

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు మోడీ,షాలు ఢిల్లీ కి కొత్త. వారికి పరిచయాలు లేవు. గుజరాత్ రాష్ట్ర రాజకీయాలను శాసించిఉండవచ్చు కానీ ఢిల్లీ ఇంకా వారికి పరిచయమవ్వలేదు. అప్పుడు వారికి ఢిల్లీకి వారధిగా, ప్రముఖులతో సమన్వయకర్తగా వ్యవహరించింది జైట్లీయే. ప్రధానంగా మీడియాతో.  మోడీ,షాలతోన సహా మీడియాతో మాట్లాడడానికి బీజేపీ ముఖ్య నాయకులు అంతగా ముందుకు వచ్చేవారుకాదు. ఆ సమయంలో మీడియాకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా జైట్లీ బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజలకు మరింత చేరువ చేసారు. 

 

సుష్మాస్వరాజ్ లాగా గొప్ప వక్త కాకపోయినా, వాజపేయి లాగా కవి కాకపోయినా బీజేపీలో కీలక నేతగా ఎదిగారు జైట్లీ. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి ట్రబుల్ షూటర్ గా సేవలందించారు. ముఖ్యంగా విపక్ష నేతలతో సంప్రదింపులు జరపడానికి అతనికున్న పరిచయాలు ఎంతగానో ఉపయోగపడేవి. మంత్రిగా సేవలందిస్తూనే,  చాలా చాకచక్యంగా విధానపరమైన నిర్ణయాల్లో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేవాడు. 

 

ఇన్ని ప్రత్యేకతలున్న అరుణ్ జైట్లీకి ఒక బలహీనత మాత్రం ఉంది. అతను మాస్ లీడర్ కాదు. మాస్ ఫాలోయింగ్ తో సంవత్సరాలుగా నియోజకవర్గాల్లో వరుసగా గెలుస్తూ వచ్చే నాయకులుండే బీజేపీ పార్టీలో ఇతను అలాంటి బలమైన నేత కాదు. అతను పార్లమెంటులోకి ప్రవేశించిన ప్రతిసారి అది రాజ్యసభ ద్వారా మాత్రమే. 2014లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి అమ్రిత్ సర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ చేతిలో ఓడిపోయారు. ఈసారన్నా లోక్ సభ ద్వారం గుండా పార్లమెంటులోకి అడుగుపెడదామనుకున్న జైట్లీకి నిరాశ తప్పలేదు. మంత్రిపదవిని చేపట్టినా, ఎంటర్ అయింది మాత్రం రాజ్యసభ డోర్ నుండే.