ముత్తూట్ ఫినాన్స్ లో భారీ దోపిడి జరిగింది. దాదాపు రూ.7కోట్లు విలువచేసే బంగారు నగలు, డబ్బులు దోచుకెళ్లారు. ఈ సంఘటన బెంగళూరు సమీపంలోని తమిళనాడు పట్టణం హోసూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్‌లోకి శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఆరుగురు దుండగులు మాస్క్‌లు, హెల్మెట్లు ధరించి చొరబడ్డారు. కత్తులు, తుపాకులతో సిబ్బందిని బెదిరించి 14 కేజీల బంగారు నగలు, రూ.96 వేల నగదును బ్యాగుల్లో నింపుకుని పరారయ్యారు. విషయం తెలిసి హోసూరు డీఎస్పీ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. దుండగులు హిందీలో మాట్లాడారని, ఉత్తరాది వారిగా అనుమానిస్తున్నట్లు సంస్థ మేనేజర్‌ తెలిపారు. పట్టపగలే భారీ దోపిడీ జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.