న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలకు చెక్ పెట్టేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంగళవారం నాడు  ప్రారంభమైంది.  రెండు రాష్ట్రాల మమధ్య నెలకొన్న  నీటి వివాదాలకు చెక్ పెట్టేందుకుగాను  ఈ సమావేశం ఉపయోగపడుతోందని భావిస్తున్నారు.

ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇవాళ ప్రారంభమైంది.

also read:ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు చిచ్చు: అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేల్చేనా?

ఆగష్టు 5వ తేదీన తొలుత  ఈ సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ  ఆ రోజున సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.  దీంతో ఈ సమావేశం వాయిదా పడింది. ఆగష్టు 25వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని భావించారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు కరోనా రావడంతో రెండోసారి సమావేశం వాయిదా పడింది. దీంతో ఇవాళ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఫిర్యాదు చేసింది. కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. 2016 తర్వాత తొలిసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.ఈ సమావేశంలో తమ తమ వాదనలను విన్పించేందుకు రెండు రాష్ట్రాలు సిద్దమయ్యాయి.