జహంగీర్‌పూర్ ఆక్రమణల కూల్చివేతపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంపై, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, ఈ విషయాన్ని బీజేపీ, ఆప్ గుర్తుంచుకోవాలని అన్నారు.
ఢిల్లీలోని జహంగీర్‌పూర్ ప్రాంతంలో ఆక్రమణల కూల్చివేతపై AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కూల్చివేతలను ఒవైసీ 1975-76 ఎమర్జెన్సీ సమయంలో తుర్క్‌మన్ గేట్ కూల్చివేత ఘటనతో పోల్చారు.
“టర్క్‌మన్ గేట్ 2022, 1976లో అధికారంలో ఉన్నవారు ప్రస్తుత కాలంలో నిష్ఫలమైన శక్తి అని చరిత్ర చెబుతోంది. ఈ విషయాన్ని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తుంచుకోవాలి. అధికారం శాశ్వతం కాదు” అని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలోని తుర్క్‌మన్ గేట్ కూల్చివేత, మురికివాడల నివాసితుల ఊచకోతతో అపఖ్యాతి పాలైంది, ఆ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై ఇందిరా గాంధీ ప్రభుత్వం కాల్పులు జరపాలని ఆదేశించింది. అందుకే ఆ ఘటనను జహంగీర్‌పూర్ కూల్చివేతలతో ఒవైసీ పోలుస్తూ ట్వీట్ చేశారు.
అంతకుముందు రోజు ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘బీజేపీ పేదలపై యుద్ధం ప్రకటించిందని అన్నారు. యూపీ, మధ్యప్రదేశ్ మాదిరిగానే ఢిల్లీలో కూడా ఆక్రమణల పేరుతో ఇళ్లను కూల్చేస్తారు. నోటీస్, కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వరు. ఇది పేద ముస్లింకు మాత్రమే శిక్ష మాత్రమే.’’ అని తెలిపారు. అనంతరం ఆయన కేజ్రీవాల్ పై కూడా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో కేజ్రీవాల్ తన పాత్ర ఏంటో స్పష్టం చేయాలని అన్నారు.
ఇందులో తమ ప్రభుత్వ పీడబ్ల్యూడీ శాఖ ప్రమేయం ఉందా అని కేజ్రీవాల్‌ను ఒవైసీ ప్రశ్నించారు. ‘‘ ఇంత ద్రోహానికి, పిరికితనానికి జహంగీర్‌పురి ప్రజలు ఓటేశారా ? ’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతల ఘటనలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అనమతుల్లా మాట్లాడుతూ.. ఢిల్లీలోని ప్రశాంత వాతావరణాన్ని అమిత్ షా, బీజేపీ చెడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. MCDని ఉపయోగించుకుంటూ జహంగీర్‌పురిలో ఇప్పుడు ఆక్రమణల పేరుతో బుల్‌డోజర్‌లను నడపడానికి, ఒక నిర్ధిష్ట వర్గాన్ని హింసించడానికి ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
కాగా ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన జహంగీర్‌పురి కూల్చివేత డ్రైవ్‌పై బుధవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. గురువారం కేసును విచారించే వరకు కూల్చివేత డ్రైవ్‌పై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 16వ తేదీన హనుమాన్ జయంతి, ఏప్రిల్ 18వ తేదీల్లో జహంగీర్‌పురి ప్రాంతంలో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘర్షణలకు కారణమైన వారు ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చివేయాలని ఢిల్లీ బీజేపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ బుధ , గురువారాల్లో ఈ ఆక్రమణలు తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రకటించింది.
