ముంబయి మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత మూడ్రోజులుగా ముంబయిలో భార్షీలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలే కాదు రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. వర్షాలకు తోడు 70 కిమీ వేగంతో గాలులు కూడా వీయడంతో చెట్లు కూలిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. 

షేక్ మిస్త్రీ దర్గా రోడ్, బీపీటీ కాలనీ, ఖేత్వాడి, నాయర్ హాస్పిటల్, సీపీ ట్యాంక్ ప్రాంతాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఇక దక్షిణ ముంబయి ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 12 గంటల వ్యవధిలో 294 మిమీ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో ఈ మేర వర్షపాతం నమోదవడం 1974 తర్వాత ఇదే ప్రథమం. అటు, తీవ్ర వర్షాలతో బాంబే హైకోర్టు తన కార్యకలాపాలన్నీ రద్దు చేసింది. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 5 బృందాలు ముంబయిలో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.

 

ఇప్పటికే.. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే.. ప్రజలకు సూచనలు చేశారు. ఎవరూ ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టవద్దని సూచించారు. కాగా.. తాజాగా.. ముంబయిలో పరిస్థితిని తెలియజేస్తూ.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోని చూస్తే.. ముంబయిలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమౌతోంది. గాలికి చిన్న పాటి మొక్కలు ఊగినట్లుగా.. పెద్ద పెద్ద వృక్షాలు ఊగిపోతున్నాయి. ఆ చెట్టు ఊగడం చూస్తూంటే ఎక్కడ పడిపోతుందో అన్నంత భయం వేస్తోంది. మీరు కూడా ఆ వీడియో వైపు ఒకసారి లుక్కేయండి.