బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె అన్నారు. అయితే కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ సాధ్యం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ (telangana cm kcr) చేస్తున్న ప్రయత్నాలను మహారాష్ట్ర (maharastra) కాంగ్రెస్ (congress) ఆదివారం స్వాగతించింది. అయితే కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం లేకుండా అది విజయవంతం కాదని తెలిపింది. కాంగ్రెస్ ఒక్క‌టే బీజేపీ (bjp) కి ప్ర‌త్యామ్నాయం అని తెలిపింది. 

మ‌హారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే (nana patole) ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (bjp) నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, జాతీయ ఆస్తులను అమ్ముకుంటోందని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. అధికార బీజేపీకి కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని చెప్పారు. “ ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు బీజేపీ తన మిత్రపక్షాలను కూడా అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఈ మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యాయి. అంతకు ముందు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇక్కడి నేతలను కలవడానికి వచ్చారు. కానీ ఆ తర్వాత ఏమీ జరగలేదు” అని అన్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను తాను స్వాగతిస్తున్నాన‌ని నానా ప‌టోలే అన్నారు. అయితే బీజేపీకి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ (UPA) మాత్ర‌మే ప్రత్యామ్నాయమని చెప్పారు. ప్రత్యామ్నాయం ఇవ్వడానికి ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను మినహాయించలేవని ఆయ‌న అభిప్రాయపడ్డారు. అంతకుముందు పార్లమెంట్‌లో బీజేపీకి లాభం చేకూర్చడంపై టీఆర్‌ఎస్‌ (trs)పై ఆయన విరుచుకుపడ్డారు.

బీజేపీ, కాంగ్రెసేత వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ (telangana cm kcr) మ‌హారాష్ట్ర‌ సీఎం ఉద్దవ్ ఠాక్రే‌తో (Uddhav Thackeray)తో నేడు భేటీ అయ్యారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలపై ఇరువురు సీఎంలు చర్చించారు. ఎన్డీయేతర సీఎంలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్న రాజకీయ భేటీ కావడంతో సర్వత్ర ఈ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఉద్దవ్‌‌తో భేటీ కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బృందం.. ఈ రోజు ప్రత్యేక విమానంలో ముంబై చేరుకుంది. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ రావు (santhosh rao), బీబీ పాటిల్ (b b patil), రంజిత్ రెడ్డి (ranjith reddy), ఎమ్మెల్సీలు కవిత (kavitha), పల్లా రాజేశ్వర్ రెడ్డి (palla rajeshwar reddy)లు ఉన్నారు. అనంత‌రం సీఎం కేసీఆర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్‌ (sharad pawar) లను కలిశారు. ఇరువురు నేతలతో పలు అంశాలపై చర్చలు జరిపిన కేసీఆర్.. రాజకీయంగా మార్పు రావాలని పిలుపునిచ్చారు. 

కేసీఆర్‌తో భేటీ అనంతరం ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. మహారాష్ట్ర నుంచి తీసుకున్న మార్గమే ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తుందని అన్నారు. ఇది శుభారంభమని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటమని ఆయన అన్నారు. కాగా.. శివసేన, ఇతర పార్టీలు థర్డ్ ఫ్రంట్‌గా ఏర్పడినా.. ఎన్డీయేపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే (central minister ramdas athawale) అన్నారు. 2024లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తామే గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.