న్యూఢిల్లీ: 2014 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పును ఇచ్చారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు.మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.కూటములతో అభివృద్ధి సాధ్యం కాదని బీజేపీ చీప్ అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు

శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి మోడీతో కలిసి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. బీజేపీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఎన్నికలు ఇవేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐదేళ్ల క్రితం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మోడీ సర్కార్ పనిచేసిందన్నారు. ఈ మేరకు మోడీ శ్రమించారని ఆయన చెప్పారు.ప్రజలు బీజేపీపై పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేళ్ల పాటు పనిచేశామని ఆయన తెలిపారు.తమ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. 

ఇల్లు,  విద్యుత్‌తో పాటు ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. భారీ మెజారిటీతో మరోసారి కేంద్రంలో బీజేపీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ 133 పథకాలను తీసుకొచ్చింది. దీని వల్ల సుమారు 50 కోట్ల మంది ప్రజలు బాగు పడ్డారన్నారు. మోడీ సర్కార్ వల్ల సుఖ, సంతోషాలతో ఉంటామని ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు.