ఓ మహిళ ఎయిర్‌పోర్టులో తన సూట్‌కేసు పోగొట్టుకుంది. ఆమె ప్రయాణించిన ఎయిర్‌లైన్ సూట్‌కేసు అరైవల్ తర్వాత అప్పగించలేకపోయింది. దాని కోసం ఆమె చాలా ప్రయత్నించింది. కానీ, అదెక్కడుందో తెలియదని ఎయిర్‌లైన్స్ చెప్పేసింది. కానీ, నాలుగు సంవత్సరాల తర్వాత హోండురాస్ నుంచి మీ లగేజీ వచ్చిందని ఫోన్ కాల్ చేసి నాలుగేళ్ల క్రితం మిస్ అయిన సూట్‌కేసును అప్పగించడంతో ఆమె మహిళ థ్రిల్ అయ్యారు. 

న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టులో లగేజ్ పోగొట్టుకోవడం సహజమే. కొన్నిసార్లు అవి రోజుల వ్యవధిలో మళ్లీ లభిస్తాయి. కొన్నిసార్లు అవి అసలే దొరకవు. వాటిపై ఆశలూ వదులుకుంటారు. కానీ, అమెరికాకు చెందిన ఆ మహిళ షికాగోలో పోగొట్టుకున్న సూట్‌కేసు నాలుగేళ్ల తర్వాత దొరికింది. ఆ సూట్‌కేసు నేరుగా ఆమె వద్దకు రాలేదు.. హోండురాస్ నుంచి టెక్సాస్‌కు చేరింది. అక్కడి నుంచి ఆమె ఇంటికి వచ్చింది.

ఏప్రిల్ గావిన్ అనే ఓరెగాన్ నివాసి ఓ బిజినెస్ ట్రిప్ మీద షికాగో వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తుండగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఆమె సూట్‌కేస్‌ను అప్పగించలేకపోయింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఆ సూట్‌కేసు హోండురాస్‌లో కనిపించినట్టు న్యూయార్క్ పోస్టు పేర్కొంది.

ఆ సూట్ కేసు కోసం ఏప్రిల్ గావిన్ ఎంతో ప్రయత్నించారు. సోషల్ మీడియాలోనూ సూట్ కేసును ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఆ సూట్ కేసు ఎక్కడ ఉన్నదో తమకు తెలియదని ఎయిర్ లైన్ ఆమెకు చెప్పేసింది. ఇక చేసేదేమీ లేదని ఆమె మిన్నకుండిపోయింది. కానీ, ఈ నెలలో ఎయిర్‌లైన్ నుంచి వచ్చిన అప్‌డేట్‌తో షాక్ అయింది.

Also Read: Viral News: స‌ర‌దాగా ముగిసిన‌ విహారయాత్ర‌.. ఇంటికెళ్లి బ్యాగ్ తెరిచి చూసి కంగుతున్న మ‌హిళ‌..

టెక్సాస్ హూస్టన్ నుంచి ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తన లగేజీ దొరికిందని వారు ఆమెకు కాల్ చేశారు. ఈ మాటలు వినగానే ఆమె కన్ఫ్యూజ్ అయింది. ఎయిర్ లైన్ కూడా ఆ లగేజీ నాలుగేళ్ల క్రితం నుంచి తిరుగుతూనే ఉన్నదని గ్రహించలేదు. బహుశా ఆ తేదీ ప్రింట్ మిస్టేక్ అని అనుకున్నారు. అందుకే క్యాజువల్‌గా కాల్ చేసి లగేజీ లభించిందని వివరించారు.

ఆ లగేజీ హోండురాస్‌లో కనిపించిందంటా.. ఎవరికి తెలుసు ఈ నాలుగేళ్లలో అది ఇంకా ఎక్కడెక్కడికి తిరిగి వచ్చిందో అని ఏప్రిల్ గావిన్ తెలిపారు. ఇది తనకు క్రిస్మస్‌లా ఉన్నదని, ఆ సూట్ కేసు విప్పి తన వస్తువులను చూస్తూ ఉంటే విచిత్ర అనుభూతి కలిగించిందని వివరించారు. కాబట్టి, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ థాంక్స్ అని పేర్కొన్నారు.