Asianet News TeluguAsianet News Telugu

ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్, భగత్ సింగ్‌ల ఫొటోలు మాత్రమే ఉంటాయి: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై ఢిల్లీలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కేవలం డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్‌ల ఫొటోలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వారి ఫొటోలు తప్పితే.. మరే ఇతర ముఖ్యమంత్రులు, రాజకీయ నేతల ఫొటోలను ఉంచబోమని స్పష్టం చేశారు. ధనిక, పేద తారతమ్యం లేకుండా నాణ్యమైన విద్యను అందించాలనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలను తాము నిజం చేస్తున్నామని చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సందర్భంలో ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.
 

ambedkar bhagat singh photos only in delhi offices says arvind kejriwal
Author
New Delhi, First Published Jan 25, 2022, 3:20 PM IST

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ(Indian Constitution) పితామహుడు, తొలి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్(BR Ambedkar), రివల్యూషనరీ భగత్ సింగ్‌(Bhagat Singh)ల ఫొటోలు మాత్రమే ఇక నుంచి తమ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటాయని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రకటించారు. వీరిద్దరి ఫొటోలు మినహా మరే ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు ఉండబోవని స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘నేను ఈ రోజు ప్రకటిస్తున్నా.. మా ప్రభుత్వ ప్రతి కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్‌ల ఫొటోలు ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రుల ఫొటోలు, ఇతర రాజకీయ నేతల ఫొటోలను ఎట్టిపరిస్థితుల్లో ఉంచము’ అని వెల్లడించారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలకు పైగా గడిచిపోయాయని ఆయన అన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి పిల్లాడికి నాణ్యమైన విద్య అందించాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంక్షించాడని తెలిపారు. ఏడు దశాబ్దాలకు ముందటి కలను ఇప్పుడు తాము సాకారం చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు పాఠశాల విద్యార్థుల కళ్లల్లో ఆ కల కనిపిస్తున్నదని వివరించారు. అంబేద్కర్, భగత్ సింగ్‌లు సమాజంలో మంచి వైపు మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు. వారు రివల్యూషన్ కోసం తపించారని పేర్కొన్నారు. వారి కలను ఇప్పుడు తాము నిజం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని వివరించారు.

బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్‌లు తమ ఆశయాలు, కలలను సాకారం చేసుకోవడానికి భిన్న మార్గాలను ఎంచుకున్నారని తెలిపారు. కానీ, వారు తమకు ఎల్లప్పుడూ ప్రేరణ ఇస్తూనే ఉంటారని చెప్పారు.

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల ఫొటోలు కనిపిస్తుంటాయి. కానీ, ఇక పై ఈ ఆచారం కొనసాగబోదని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ఇలాంటి ఫొటోలు దర్శనం ఇవ్వబోమని వివరించారు. కేవలం ఇద్దరు మహానుభావుల చిత్రాలు మాత్రమే కనిపిస్తాయని స్పష్టం చేశారు.

భారత దేశం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

కాగా, త్వరలోనే పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా పంజాబ్‌ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టింది. పంజాబ్‌లో దళితుల సంఖ్య అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. అంబేద్కర్‌ను అన్ని వర్గాలతోపాటు దళితులు ప్రముఖంగా కొలుస్తారన్న విషయం విదితమే. అలాగే, భగత్ సింగ్ పంజాబ్‌లో జన్మించిన విషయమూ తెలిసిందే. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే భగత్ సింగ్ జన్మించిన పంజాబ్ రాష్ట్రంలో ఆయనకు గౌరవం, భక్తి మరింత ఎక్కువగా ఉంటుందన్నదీ తెలిసిందే. ఈ తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ పై ప్రకటన చేశారు.

ఇక్కడ పోటీ ప్రధానంగా అధికారంలోని కాంగ్రెస్‌కు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యే ఉన్నట్టు తెలుస్తున్నది. బీజేపీ, శిరోమణి అకాలీ దళ్, అమరీంద్ సింగ్ పార్టీలు తమ ఉనికిని ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios