జ్ఞానవాపి పిటిషనర్ల మధ్య విభేదాలు? కారుణ్య మరణానికి అనుమతివ్వాలని రాష్ట్రపతికి పిటిషనర్ లేఖ.. జూన్ 9 డెడ్ లైన్
జ్ఞానవాపి కేసులో పిటిషనర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మిగిలిన నలుగురు పిటిషనర్లు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, కాబట్టి, కారుణ్య మరణానికి అనుమతించాలని ఈ కేసు నుంచి విత్ డ్రా చేసుకున్న పిటిషనర్ రాఖి సింగ్ తెలిపారు. జూన్ 9వ తేదీలోగా తనకు సమాధానం ఇవ్వాలని డెడ్ లైన్ పెడుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు.
న్యూఢిల్లీ: వారణాసిలో జ్ఞానవాపి కేసు దేశవ్యాప్తంగా చర్చను లేపిన సంగతి తెలిసింది. ఆ మసీదు కాంప్లెక్స్‌లో హిందూ దైవం ఉన్నదని, అక్కడ పూజలు చేయడానికి అనుమతించాలని ఐదుగురు హిందువులు పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ పిటిషనర్ల మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఆ విభేదాలు కూడా దేశవ్యాప్తంగా చర్చను రేపేలా ఉన్నాయి.
వారణాసి జ్ఞానవాపి కేసు నుంచి వెనక్కి వెళ్లిన పిటిషనర్ రాఖీ సింగ్ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతించాలని అందులో కోరారు. జ్ఞానవాపి కేసులో మిగిలిన నలుగురు పిటిషనర్లు తనను వేధిస్తున్నారని ఆరోపించారు.
ఆ నలుగురు పిటిషనర్లు తనను వేధిస్తున్నారని వివరిస్తూ రాఖి సింగ్ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖకు సమాధానం జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల్లోపు తనకు రావాలని డెడ్ లైన్ విధించారు.
‘మీ సమాధానం కోసం 2013 జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు వేచి చూస్తూ ఉంటాను. మీ నుంచి నాకు ఎలాంటి స్పందన రాకపోతే.. ఆ తర్వాత తీసుకునే నిర్ణయానికి పూర్తిగా నాదే బాధ్యత’ అని రాఖి సింగ్ హిందీ భాషలో రాసిన లేఖలో పేర్కొన్నారు.
Also Read: బీజేపీకి మద్దతుగా లేని పార్టీ ఒక్కటైనా దేశంలో ఉన్నదా?: విపక్ష ఐక్యకూటమిపై దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు
నలుగురు పిటిషనర్లు తనను అపఖ్యాతి పాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని, తనను, తన కుటుంబానికి అప్రతిష్ట అంటగడుతున్నారని ఆరోపించారు. 2022 మే నెలలో ఈ పిటిషనర్లు తనకు వ్యతిరేకంగా వారి దుష్ప్రచారంలో భాగంగా తప్పుడు వదంతులు వ్యాప్తి చేశారని పేర్కొన్నారు. తాను, తన అంకుల్ జితేండ్ర సింగ్ విసెన్ ఈ కేసులో నుంచి ఉపసంహరణ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకముందే ఈ పిటిషనర్లు ముందుగానే తాము ఉపసంహరించుకున్నట్టు ప్రచారం చేశారని తెలిపారు.
ఈ గందరగోళంతోనే మొత్తం హిందూ సమాజమే తనకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా మారారని ఆమె తెలిపారు. ప్రభుత్వం నుంచి పాలక వర్గం నుంచి చాలా మంది ఈ దుష్ప్రచారంలో పాలుపంచుకుంటున్నారని వివరించారు. ఈ విషయమై తాను తీవ్ర కలత చెందానని పేర్కొన్నారు. కాబట్టి.. ఈ బాధకు అంతిమ గీతం పాడటానికి కారుణ్య మరణానికి తనకు అనుమతించాలని ఆమె కోరారు.