ఇంట్లో ఎలుక కనిపిస్తే దాన్ని చంపేవరకు నిద్రపోం. మందుపెట్టో, బోన్ పెట్టో దాన్ని పట్టుకునేదాకా మనసుకు పట్టదు. కానీ యూపీలో ఓ వ్యక్తి ఎలుకను పెంచుకోవడమే కాక, దాని కంట్లో కణితికి ఆపరేషన్ కూడా చేయించాడు. వివరాల్లోకి వెడితే..

ఉత్తర్ ప్రదేశ్, అలీగఢ్ లోని నుమాయిష్ గ్రౌండ్ నివాసి అమిత్ కుమార్‌‌కు కొద్ది రోజుల క్రితం ఇంటికి సమీపంలో ఒక తెల్ల ఎలుక కనిపించింది. దానిని అమిత్ ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు. అయితే అది ఆహారం తీసుకోకపోవడంతో అనుమానం వచ్చి గమనిస్తే దాని కంట్లో ఏదో సమస్య ఉన్నదని గ్రహించాడు. 

దీంతో అమిత్ తెల్ల చిట్టెలుకను సురేంద్ర నగర్‌లోని వెటర్నరీ డాక్టర్ విరామ్ వైష్నోయ్ దగ్గరకు తీసుకువెళ్లాడు. దానిని పరిశీలించిన డాక్టర్ ఆ ఎలుక కంటిలో ట్యూమర్ ఉందని, ఆపరేషన్ చేయాలని చెప్పాడు. 

దీనికి అమిత్ ఒప్పుకోవడంతో రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి, ఎలుక కంట్లోనుండి 25 గ్రాముల కణతిని తొలగించారు. ఒక గంట తరువాత ఆ ఎలుక కోలుకుంది. ఇప్పుడది పూర్తి ఆరోగ్యంతో అమిత్ ఇంట్లో తిరుగాడుతోంది.