UP Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి, సమాజాకి న్యాయం లాంటి అంశాలపై కాకుండా హిందుత్వంపై మతంపై ఈ రెండు పార్టీల ఎన్నికల ప్రచారం జరుగుతోందని విమర్శించారు.  

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ముఖ్యంగా ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హమీలు ఇస్తూ.. ఓటర్లను ఆకట్టుకుంటూనే, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు ప్ర‌ధాన లీడ‌ర్లు. యూపీలో పొలిటిక‌ల్ ఫైట్ ప్ర‌ధానంగా యోగీ ఆదిత్యనాథ్, అఖిలేశ్‌ యాదవ్ జ‌రుగుతోంది. వీరి పంచుల‌కు పొలిటికల్‌ ఫైట్‌ హీటెక్కింది. తాజాగా ఈ ఫైట్‌లోకి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎంట్రీ ఇచ్చారు .

భారతీయ జనతా పార్టీ (బిజెపి), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి)ల‌పై త‌న‌దైన శైలిలో విరుచుక‌ప‌డ్డారు. ఈ రెండు పార్టీలు ప్రజా సమస్యలు, అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. హిందుత్వంపై మతంపై ఈ రెండు పార్టీల ఎన్నికల ప్రచారం జరుగుతోందని విమర్శించారు.

AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నిక‌ల్లో ఎస్సీ అధినేత అఖిలేష్ యాదవ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు హిందుత్వం పోటీ పెట్టుకున్నారని, ఈ ఇద్దరూ మోడీ కంటే గొప్ప హిందువులు కావడానికి పోటీ పడుతున్నారనీ, ఒక్క‌రూ ఆలయం గురించి మాట్లాడితే, మ‌రోక‌రు వేరే దేవాలయం గురించి మాట్లాడతారని ఓవైసీ దుయ్యబట్టారు.

ఇక పోతే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం 100 స్థానాల్లో పోటీకి దిగనున్నట్లు ఓవైసీ ప్రకటించారు.
కొన్ని పార్టీలతో క‌లిసి ‘భగీదారీ సంకల్ప్ మోర్చా’ అనే కూట‌మిగా ఏర్పడ‌మ‌నీ, ఈ మోర్చా ఆధ్వర్యంలో మొత్తం 403 స్థానాల్లో ఏఐఎంఐఎం దాదాపు 100 స్థానాల్లో పోటీ చేస్తుందని ఒవైసీ ప్రకటించారు. తమ కూటమి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఎంచుకున్నామని, ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే బాబు సింగ్ కుశ్వాహా మొదటి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని, మరో రెండున్నరేళ్లు దళిత ముఖ్యమంత్రి ఉంటారని ఓవైసీ అన్నారు.

ఇక ఉప ముఖ్యమంత్రి విష‌యానికి వ‌స్తే.. ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, ఒకరు ముస్లిం వర్గానికి చెందిన వారు కాగా మరో ఇద్దరు వెనుకబడిన వర్గానికి చెందిన వారు ఉంటారని ఓవైసీ తెలిపారు.

ఇదిలావుంటే, 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో.. ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలు ఫిబ్రవరి 10న జరగనున్నాయి. దీని తర్వాత రెండో దశ ఫిబ్రవరి 14న, మూడో దశ ఫిబ్రవరి 20న, నాలుగో దశ ఫిబ్రవరి 23న, ఐదో దశ ఫిబ్రవరి 27న జరగనుంది. దీంతో పాటు మార్చి 3న ఆరో దశ, మార్చి 7న ఏడో దశ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.