కడుపుతో ఉన్న మహిళలతో ఎవరూ ఎలాంటి పనులు చేయించరు. ఏదైనా పనిచేస్తే.. వారికీ, వారి కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని అందరూ భయపడతారు. అందుకే.. వారితో ఎలాంటి పనులు  చేయనివ్వకుండా.. ప్రసవం అయ్యేవరకు జాగ్రత్తగా చూసుకుంటారు. ఎక్కువ సేపు నడవడం, మెట్లు దిగడం లాంటి పనులు కూడా చేయనివ్వరు. అలాంటిది.. నిండు గర్భిణీలు దాదాపు 50మంది మహిళలు... నవరాత్రి ఉత్సవాల్లో నృత్యాలు చేశారు.  ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి విరవాల్లోకి వెళితే... నవరాత్రుల సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో  ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలు నృత్యాలు చేశారు.  గర్బా పాటలకు వీరంతా బేబీ బంప్‌తో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో 50 మంది గర్భిణులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారిలో ఒక గర్భిణి మాట్లాడుతూ తాను గత పదేళ్లుగా గర్బా నృత్యంచేస్తూ వస్తున్నానని, ప్రెగ్నెన్సీ కారణంగా ఈసారి గర్బాలో పాల్గొనలేనేమోనని అనుకున్నానన్నారు. అయితే ఇలా ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గర్బా నృత్యం చేయాలన్ని తన కోరిక తీరిందన్నారు. 

ఈ నృత్యం కారణంగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా ఆనందిస్తాడని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ గర్బా ఆడే మహిళల్లో ఎండార్ఫిన్ హార్మోన్ వృద్ధి చెందుతుందన్నారు. ఇది శరీరానికి ఎంతో ప్రయోజనకారి అని, తద్వారా డెలివరీ సమయంలో పెయిన్ తగ్గేందుకు అవకాశముంటుందని అన్నారు.