ఆరేళ్ల పిల్లాడు అక్షరాలు సరిగా రాయడం లేదని ఆవేశంతో ఆ టీచర్లు ఊగిపోయారు. అదే ఆవేశంలో ఆ పిల్లాడిని తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ పసివాడు భయంతో వాంతులు చేసుకున్నాడు. ఊపిరి కూడా ఆడకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
తమిళ అక్షరాలు సరిగ్గా రాయలేదని 6 ఏళ్ల బాలుడిని ముగ్గురు టీచర్లు తీవ్రంగా చితకబాదారు. దీంతో ఆ పిల్లాడు హాస్పిటల్ పాలవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చైన్నైలో చోటు చేసుకుంది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ బెయిల్ పై విడుదల చేశారు. అయితే ఓ టీచర్ పై జిల్లా విద్యాశాఖాధికారులు విచారణ జరిపి విధుల నుంచి తొలగించారు.
చెన్నైలోని పెరవళ్లూరుకు చెందిన 6 ఏళ్ల బాలుడు అదే ప్రాంతంలోని డాన్‌బాస్కో మెట్రిక్యులేషన్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. ఆ పిల్లాడికి ఏప్రిల్ 9వ తేదీన ప్రత్యేక తరగతి నిర్వహించారు. ఇందులో ఆ బాలుడు అక్షరాలు సరిగా రాయలేకపోయాడు. దీంతో కోపోద్రిక్తులైన ముగ్గురు టీచర్లు పసి బాలుడని కూడా చూడకుండా తీవ్రంగా కొట్టారు.
ఇలా బాలుడిపై తరచూ టీచర్లు చేయిచేసుకుంటూనే ఉంటారు. ఈ విషయంలో తల్లి గతంలో కూడా టీచర్లను హెచ్చరించినప్పటికీ ఏప్రిల్ 9వ తేదీన మళ్లీ బాలుడిని తీవ్రంగా కొట్టారు. ఆ రోజు సాయంత్రం ఆ పిల్లాడు ఇంటికి చేరుకున్నాక ఏడుస్తూనే ఉన్నాడు. తరువాత వాంతులూ కూడా అయ్యాయి. కొంత సమయం తరువాత ఊపిరి కూడా ఆడలేదు. దీంతో షాక్‌కు గురైన తల్లి కుమారుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది.
చికిత్స తర్వాత పిల్లవాడు స్పృహలోకి వచ్చాడు. కానీ ఆ బాబుని భయం వెంటాడుతూనే ఉంది. ఇంకా ఆ షాక్ లో నుంచి బయటకు రాలేకపోయాడు. చికిత్స పొందుతున్న కుమారుడిని తల్లి ఓదార్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తమిళ టీచర్ తనను కొట్టాడని ఆ పిల్లాడు చెప్పడం కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. పిల్లాడు ఎల్‌కేజీ లో ఆన్‌లైన్ తరగతులకు హాజరు కాలేదని, కాబట్టి ఎక్కువగా తెలియదని గతంలోనే తల్లి టీచర్లతో చెప్పింది. అయినా తాము నేర్పిస్తామని ఆ బాబుని డైరెక్ట్ గా యూకేజీలో జాయిన్ చేసుకున్నారు. అయితే టీచర్లు కుమారుడిని కొడుతున్నారని తెలియడంతో స్కూల్ కు కూడా వెళ్లింది. చిన్న పిల్లవాడు కాబట్టి కొట్టవద్దని అభ్యర్థించింది. తల్లి ఇలా అభ్యర్థన చేసినప్పటికీ టీచర్లు ఆ బాలుడిపై దాడిని కొనసాగించారు.
ఏప్రిల్ 9వ తేదీన బాలుడికి అక్షరాలు రాయడం నేర్పేందుకు టీచర్లు ప్రత్యేకంగా తరగతి నిర్వహించారు. ఈ సమయంలో పిల్లాడు సరిగా రాయకపోవడంతో టీచర్లు కొట్టారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇండియానా వాన్, ఇంగ్లీష్ టీచర్ మోనో ఫెరారా, తమిళ టీచర్ ప్రిన్సిలను మొదట అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.
ఈ ఘటనపై విచారణ జరిపేందుకు జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి కొలత్తూరులోని ప్రైవేట్ పాఠశాలను సందర్శించారు. విచారణ అనంతరం టీచర్ ఇండియానా వాన్‌ను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు టీచర్లపై కూడా స్కూల్ చర్యలు తీసుకోనుంది. అయితే దీనిపై స్కూల్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
