భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు మరో గౌరవం దక్కింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న 51వ స్క్వ్రాడన్‌కు యూనిట్ సైటేషన్ అవార్డ్ దక్కింది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రారంభమై 87 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా అక్టోబర్ 8న జరిగే ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో 51వ స్క్వాడ్రన్‌ గ్రూప్ కెప్టెన్ సతీశ్ పవార్ ఈ అవార్డును అందుకోనున్నారు.

అలాగే పాక్ విమానాలు భారత్‌పై దాడి చేసేందుకు వస్తున్నట్లు గ్రహించి వాయుసేన బృందాన్ని అప్రమత్తం చేసిన మింటీ అగర్వాల్ నేతృత్వంలోని 601 సిగ్నల్ యూనిట్‌కి కూడా ఈ అవార్డు అందించనున్నారు.

కాగా బాలాకోట్ సర్జికల్స్ స్ట్రైక్స్ తర్వాత భారత వైమానిక స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ యుద్ధ విమానాలు ప్రయత్నించాయి. అయితే వాటిని వెంటాడుతూ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని అభినందన్ కూల్చివేశారు.

అయితే ప్రమాదవశాత్తూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో దిగి.. శత్రు సైన్యానికి చిక్కారు. పాక్ సైనికులు దేశ రహస్యాల కోసం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ అభినందన్ వాటిని బయటపెట్టలేదు. ఆ సమయంలో ఆయన చూపన ధైర్యసాహసాలకు భారత ప్రభుత్వం వీరచక్ర పురస్కారాన్ని అందజేసిన సంగతి తెలిసిందే.