ఆందోళనల నుంచే ఆప్ పుట్టింది.. కాబట్టి భయపడేది లేదు - ఎంపీ సంజయ్ సింగ్
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి, ఆరు నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం సాయంత్రం విడుదల అయ్యారు. ఆయనకు జైలు బయట ఆప్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆరు నెలల తరువాత ఆయన తీహార్ జైలు నుంచి బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. సంజయ్ సింగ్ జైలు నుంచి బయటకు రాగానే 'జష్న్ మననే కా వక్త్ నహీ అయా హై, సంఘర్ష్ కా వక్త్ హై' (సంబరాలకు ఇది సమయం కాదు.. ఇది పోరాడే సమయం) అని అన్నారు. తమ పార్టీ సీనియర్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాలను జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు. జైలు తాళాలు పగులగొట్టి బయటకు వస్తారని తనకు నమ్మకం ఉందని అన్నారు.
అనంతరం సంజయ్ సింగ్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆప్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆందోళన నుంచి ఆప్ పుట్టింది. మేం దేనికీ భయపడం.’’ అని అన్నారు. ఆప్ ను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. తాను ఆరు నెలలు జైల్లో ఉన్నానని, ఆప్ లోని ప్రతి కార్యకర్త, నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కు అండగా నిలుస్తున్నారని తెలిపారు.
బీజేపీకి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, దేశవ్యాప్తంగా ఉన్న అవినీతిపరులందరినీ పార్టీలోకి చేర్చుకున్నారని ఆరోపించారు. దేశంలో నిరంకుశత్వం విస్తృతంగా ఉందని, తామంతా సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెంట ఉన్నామని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అస్సలు రాజీనామా చేయరని, రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజల కోసం పనిచేస్తారని చెప్పారు.
కాగా.. సంజయ్ సింగ్ బెయిల్ కు బెయిల్ వచ్చి, బయటకు విడుదల కావడం పట్ల ఢిల్లీ మంత్రి అతిషి స్పందించారు. సత్యమే గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఈ నకిలీ మద్యం పాలసీ కేసును దర్యాప్తు చేస్తున్నారని, ఈడీ పలుమార్లు సోదాలు నిర్వహించినా ఆప్ నేతల నుంచి అవినీతి సొమ్ము దొరకలేదని అన్నారు.
ఇదిలా ఉండగా.. 2023 అక్టోబర్ 13 నుంచి సంజయ్ సింగ్ దేశ రాజధానిలోని హై సెక్యూరిటీ జైలులో ఉన్నారు. బుధవారం సాయంత్రం మూడో నెంబర్ గేటు గుండా బయటకు వచ్చారు. బెయిల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయనను విడుదల చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. జైలు వెలుపల పెద్ద సంఖ్యలో ఆప్ మద్దతుదారులు గుమిగూడి 'దేఖో దేఖో కౌన్ ఆయా, షేర్ ఆయా, షేర్ ఆయా', 'సంజయ్ సింగ్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. సంజయ్ సింగ్ కు మెడలో పూల మాల వేసి స్వాగతం పలికారు. ఢిల్లీ క్యాబినెట్ మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ కూడా జైలు బయట ఆయన కోసం ఎదురు చూశారు.