అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలను మట్టికరిపించి.. ఒంటి చేత్తో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఆదివారం రామ్‌లీలా మైదానంలో ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మఫ్లర్ వాలా మరో రికార్డును సొంతం చేసుకున్నారు.

కేవలం 24 గంటల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా పది లక్షల మంది ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు పార్టీ సభ్యత్వం కావాల్సిన వారు మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా సూచించింది.

దీనికి దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 24 గంటల్లోనే 11 లక్షల మంది ఆప్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. దీనిపై ఆమ్ ఆద్మీ నేతలు స్పందిస్తూ.. 24 గంటల్లోనే 11 లక్షల మంది సభ్యత్వం తీసుకోవడం భారీ విజయంగా ట్వీట్ చేశారు. ప్రజల నుంచి ఇంతటి స్పందన లభించడం చరిత్రాత్మకమని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పార్టీ నేతలతో అన్నట్లుగా తెలుస్తోంది.

మంగళవారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను 62 స్ధానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. బీజేపీ 8 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమవ్వగా.. హస్తం అసలు ఖాతా కూడా తెరవలేదు.

ఈ నెల 16న ఆదివారం జరిగే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖులను కాకుండా ప్రజలే తన కార్యక్రమానికి ముఖ్య అతిథులని కేజ్రీవాల్ తెలిపారు.