డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, లెర్నర్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ వంటి ర‌వాణా శాఖ సేవలు పొందేందుకు ఇకపై ఆర్‌టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి 58 రకాల సేవల్ని ఇంట్లో ఉండే.. ఆన్‌లైన్‌ ద్వారానే పొందేలా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ  కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. రకరకాల సర్వీసులు ఆన్‌లైన్ ద్వారా పొందే వెసులుబాటు వ‌చ్చింది. బ్యాంకింగ్ సర్వీసుల‌ నుంచి ఇతర సేవల వరకు అన్ని ఆన్‌లైన్ ద్వారా పొంద‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో వాహనాలకు సంబంధించిన సేవ‌లు కూడా ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్నాయి.

ఇక నుంచి ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాల‌(ఆర్టీఓ) చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ర‌వాణా శాఖ సేవ‌లు పొంద‌వ‌చ్చు. ఆర్టీఓ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కృషి చేస్తుంది. ఆధార్ ధృవీకరణ సహాయంతో ఆర్టీఓ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. ఈ మేరకు సెప్టెంబర్ 16న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 

దీని ప్రకారం.. వాహనం రిజిస్ట్రేషన్‌, ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌, పర్మిట్, లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, లైసెన్స్‌లో చిరునామా మార్పు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి 58 రకాల పౌర సంబంధిత సేవలను ఆన్‌లైన్‌ ద్వారానే పొందొచ్చు. ఈ సేవ‌ల‌ను ఆధార్ కార్డు అనుసంధానం చేయడం ద్వారా స్వచ్ఛందంగా పొందవచ్చు. కానీ, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మాత్రం.. క‌చ్చితంగా ఆర్‌టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిందే.. 

ఇలా సేవ‌ల‌ను ఆన్‌లైన్‌ ద్వారా చేయడం వల్ల ఆర్టీవో సిబ్బందిపై భారం తగ్గుతుందని, ప్రజల పాలన, జీవన పరిస్థితులను సులభతరం చేసే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల ఆర్టీఓ కార్యాల‌యాల‌కు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, దీంతో ఉద్యోగుల పనిలో మరింత సామర్థ్యం పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.


Scroll to load tweet…