న్యూఢిల్లీ: పూల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై  సరిగ్గా ఏడాది క్రితం జైషే మహ్మాద్ ఉగ్రవాది ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు.. ఈ ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.  శ్రీనగర్- జమ్మూ కాశ్మీర్ జాతీయ రహాదారిపై ఈ  ఘటన చోటు చేసుకొంది.

ఈ ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి.  ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని  ప్రజలు అభిప్రాయపడ్డారు.

అన్ని రాజకీయ పార్టీలు కూడ ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటన తర్వాత ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించిన ప్రధాని తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.

ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచంలోని పలు దేశాలు ఈ దాడులను ఖండించాయి. టెర్రరిజానికి వ్యతిరేకంగా జరిగే పోరుకు తమ మద్దతును ప్రకటించాయి.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ దాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కు ఎప్పుడూ స్నేహా హస్తం అందించే చైనా కూడ భారత్‌కు అండగా నిలిచింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. 

అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజహర్ ను గుర్తించేందుకు భారత్ దౌత్యపరమైన అన్ని రకాల చర్యలను తీసుకొంది. అయితే భారత్ తీసుకొన్న చర్యల కారణంగా గత ఏడాది మే 1వ తేదీన అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించారు. 

పూల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత  అంటే గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారుజామున బాలకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ కు దిగింది.

ఈ దాడుల్లో పలు ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులు, మిలిటెంట్లు మృతి చెందారు. ఈ దాడి తర్వాత భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వివరించింది.

ఈ ఘటన జరిగిన మరునాడే అంటే ఫిబ్రవరి 27న  భారత వైమానిక స్థావరాలపై పాక్ దాడికి ప్రయత్నించింది. ఈ దాడిని భారత్ అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్‌కు చెందిన మిగ్ కమాండర్ అభినందన్ పాక్ విమానాలను వెంటాడాడు. ఈ క్రమంలో మిగ్ ఫ్లైట్ కుప్పకూలింది.

మిగ్ కూలిపోయే సమయంలో అభినందన్ సురక్షితంగా పాక్ గ్రామానికి సరిహద్దులో దిగాడు. అయితే పాకిస్తాన్ కు చెందినవారు అతడిపై దాడికి దిగారు. పాక్ ఆర్మీ అతడిని విచారించింది.  ఏ విషయాలను కూడ అతడు బయటపెట్టలేదు.

అభినందన్ ను వదిలివేయాలని అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ వెంటనే ఆయనను వదిలిపెట్టింది.  అన్ని రకాల పరీక్షల తర్వాత అభినందన్ తిరిగి విధుల్లో చేరాడు.

శత్రువు భూభాగంలో ప్రవేశించి కూడ  అత్యంత ధైర్యంతో ఏ ఒక్క సమాచారాన్ని కూడ బయటకు చెప్పని అభినందన్ నిజమైన హీరో అంటూ అప్పట్లో ఆయనను దేశమంతా అభినందించింది.