అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఇక శబరిమలకు వెళ్లడానికి ఇబ్బంది పడనక్కరలేదు. శబరిమలకు నేరుగా రైలు మార్గానికి కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాదు దీనికయ్యే ఖర్చులో సగం తానే భరిస్తానని కూడా పేర్కొంది. 

ఇప్పటివరకు శబరిమలకు డైరెక్టుగా రైలు మార్గం లేదు. శబరిమల వెళ్లాలనుకునేవారు కొట్టాయం, తిరువల్ల, చెంగనూర్ వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి బస్సులు, కార్లలో పంబకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం దాదాపు 90 కిలోమీటర్లు ఉంటుంది. పంబకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి కాలినడకన శబరిమలకు చేరుకోవాల్సి ఉంటుంది. 

అయితే ఎట్టకేలకు శబరిమలకు నేరుగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు కేరళ ప్రభుత్వం ఓకే చెప్పింది. ప్రాజెక్టలో తాము 50 శాతం ఖర్చు భరిస్తామని కూడా అందులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో దశాబ్దాలుగా భక్తులు ఎదురు చూస్తున్న రైలు మార్గం కల సాకారమైంది.

ఎప్పుడో 1998లో ఎర్నాకులంలోని అంగమాలి నుంచి కొట్టాయంలోని ఎరుమేలి వరకు 111 కిలోమీటర్ల రైలు మార్గం ఏర్పాటుకు సంబంధించి కేంద్రం ప్రతిపాదించింది. ఇది శబరిమలకు దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 

శబరిమలతో పాటు అనేక ఆలయాలను కలుపుతూ ఈ రైల్వే లైను వెళుతుంది. అయితే ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు విషయంలో కేంద్రానికి, అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం రేగింది. దీంతో దాదాపు రెండు దశాబ్దాల నుంచి ప్రాజెక్టు వాయిదా పడుతూనే వస్తోంది. 

అయితే ఎట్టకేలకు ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర షరతులకు తలూపింది. రైలు మార్గానికయ్యే ఖర్చులో 50 శాతం భరిచేందుకు ఒప్పుకుంది. దీంతో దశాబ్దాల నాటి భక్తుల కల నెరవేరినట్లేది.