ఎమ్మెల్యేలు, ఎంపీలు, పంచాయతీ వార్డ్ మెంబర్లు ఇలా దేశంలో ప్రజలు తమకిష్టమైన వ్యక్తిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించడం సహజమే.. అలాంటిది పుట్టిన బిడ్డకు ఏ పేరు పెట్టాలో తేల్చుకోవడానికి ఎన్నికలు జరిగితే.. వినడానికే వింతగా ఉంది కదూ.. కానీ ఇది నిజంగా జరిగింది. మహారాష్ట్రలోని గొండియాకు చెందిన మిథున్, మాన్షీ బాంగ్ దంపతులకు ఇటీవలే ఓ మగబిడ్డ జన్మించాడు.

బిడ్డ పుట్టిన ఆనందంలో ఆ తల్లిదండ్రులు అతని జాతకం చూపించగా... ఆ బిడ్డ భవిష్యత్తులో గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని జ్యోతిష్యులు చెప్పారట. అలాంటి కొడుక్కి మంచి పవర్ ఫుల్ నేమ్ ఒకటి పెట్టాలని భావించి.. యక్ష, యోవిక్, యువన్ అనే మూడు పేర్లను పరిశీలించారు. చూడటానికి మూడు పేర్లు బాగున్నాయి.. కానీ వీటిలో ఏది పెట్టాలో తెలియక ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు..

మూడు పేర్లతో బ్యాలెట్ పేపర్లు తయారు చేయించి.. బంధువులు, సన్నిహితులును నివాసానికి పిలిచి జూన్ 15న పోలింగ్ నిర్వహించారు.. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపులో యువన్ అన్న పేరుకు అత్యధిక ఓట్లు పడ్డాయి. దీంతో అక్కడే బిడ్డకు యువన్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.